అతని పై బుల్లెట్ల వర్షం…  రక్తంతోనే బిడ్డను పరీక్ష కేంద్రానికి చేర్చాడు

అతనో గ్రామ మాజీ సర్పంచ్. అయితే అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది ఆటలు సాగకుండా నీజాయితీగా పని చేశాడు.దీంతో అతను పలువురికి శత్రువుగా మారాడు. అతనిని చంపాలని వారు కొంత కాలంగా వేచి చూస్తున్నారు. తన కూతురు పదో తరగతి పరీక్షలు ఉండడంతో కారులో బయల్దేరాడు. అంతలోనే అతనిని మధ్యలో దుండగులు ఆరుగురు చుట్టుముట్టి అతని పై తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. అయినా అతడు భయపడకుండా కారును డ్రైవ్ చేస్తూ తన కూతురు పరీక్షా కేంద్రం దగ్గరి వరకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ఆమెను పరీక్ష కేంద్రంలో దింపాడు.

బాధితుడి ధైర్యసాహసాలు చూసి స్థానికులే ఆశ్చర్యపోయిన ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలోని బేగుసరాయ్‌ జిల్లాలో జరిగింది. రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీకి చెందిన రాంక్రిపాల్‌ మహతో మాజీ సర్పంచ్‌. పదో తరగతి చదువుతున్న అతని కుమార్తె బేగుసరాయిలో వార్షిక పరీక్షలు రాయాల్సిఉంది. కేంద్రంలో కుమార్తెను దింపేందుకు రాంక్రిపాల్‌ కారులో బయలుదేరాడు.

బేగుసరాయికి కొద్దిసేపట్లో చేరుకుంటారనగా గుర్తు తెలియని ఆరుగురు సాయుధులైన వ్యక్తులు అతని కారుని చుట్టుముట్టి కాల్పులు జరిపారు.  తీవ్ర గాయాలతోనే అతను తన కూతురిని పరీక్షా కేంద్రంలో దింపాడు. ఆ తర్వాత స్థానికుల సహాయంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. పాత కక్షలతోనే ఇలా చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.