గత రెండు రోజులుగా విశాఖ రుషికొండ బీచ్ ఎంట్రీ ఫీజు వార్తతో రాజకీయ హడావుడి ఎక్కువ అయింది. అసలు విషయం తెలిసి కోంతమంది.. తెలియక కొంతమంది.. అవగాహన లేక కొంతమంది.. అవగాహన ఉండీ బురదజల్లాలని ఇంకొంతమంది… నోటికి వచ్చినట్లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
అవును… బీచ్ వస్తే ఫీజులు వేస్తారా, ముక్కు పిండి వసూలు చేస్తారా, ప్రకృతి సంపదను అనుభవించడం ప్రజల హక్కు అంటూ ప్రజల గురించి ఆలోచిస్తామనే భ్రమను కల్పించే పనికి పూనుకున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. ఇందులో ముఖ్యంగా పసుపు పార్టీ నేతలు.. నిత్యం పసుపురంగు పులుముకోవడానికి ఆత్రం చూపించే ఎర్ర రంగు పార్టీ నేతలుల్!
అయితే తాజాగా వీరందరికీ షాకిచ్చేలా.. మరో మాట ఎత్తకుండా ఉండేలా కీలక విషయాన్ని వెళ్లడించారు మంత్రి గుడివాడ అమరనాధ్! అవును.. రుషికొండ బీచ్ ఎంట్రీ ఫీజు వసూలు విషయంపై విపక్షాలు నోరు మెదపలేని విషయన్ని అమరనాథ్ బయట పెట్టారు. ఇది పూర్తిగా కేంద్రం ఆలోచన అని స్పష్టం చేశారు.
అవును… రుషికొండ బీచ్ ఎంట్రీ ఫీజు వసూలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని అసలు విషయం చెప్పిన అమరనాథ్… రుషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ ఇచ్చినందున ఫీజు పెట్టాలని కేంద్రం ప్రతిపాదనలు చేసిందని తెలియచేశారు. ఇదే సమయంలో… బీచ్ మెయింటెయినెన్స్ వంటి వాటికి ఆ సొమ్ము వినియోగించాలని కేంద్రం సూచించిందని స్పష్టం చేశారు. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని గుడివాడ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం బీచ్ కి వచ్చే సామాన్య ప్రజల మీద ఆ భారాన్ని వేసేందుకు ఇష్టపడలేదని చెప్పిన గుడివాడ… బీచ్ మెయింటెనెన్స్ తో పాటు బ్లూ ఫ్లాగ్ స్టాటస్ ని కొనసాగించేలా చేసేందుకు పూర్తి స్థాయిలో ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుంది అని తెలిపారు. దీని మీద పత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆయన ఖండించారు. కేంద్రం నుంచి ప్రతిపాదన వచ్చింది అన్నది రాయలేదని ఆయన అంటున్నారు.
ఈ విషయం తెలియక కొంతమంది టీడీపీ నేతలు, జనసేన నేతలు.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా… విషయం తెలుసుకోకుండా పసుపు పత్రికల్లో వచ్చిన వార్తనే నమ్మేసి.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. దీంతో… ఈ విషయంపై ఇప్పుడు ప్రజలకు ఫుల్ క్లారిటీ వచ్చింది.. ప్రతిపక్షాల విమర్శల్లోనూ, పసుపు పత్రికల వార్తల్లోనూ నిజం లేదని తేలిందని అంటున్నారు పరిశీలకులు.