ఉద్యోగుల రుణం తీర్చుకునే అవకాశం… బాబు తీర్చుకుంటారా?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికీ, కూటమి బలంగా గెలవడంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం అనేది తెలిసిన విషయమే. ప్రధానంగా ఉపాధ్యాయులు అయితే అవుట్ రేట్ గా కూటమికి మద్దతు పలికారు. అయితే… వారికీ బాబు షాక్ ఇవ్వబోతున్నారని అంటున్నారు!

అవును… ఎన్నికల్లో హామీలు ఇవ్వడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిలబెట్టుకొవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే.. జనాలను నమ్మించ గలిగితే చాలు.. ఓ ఐదేళ్లు ఇబ్బంది ఉండదు. అలా అని వాటికి ప్రత్యామ్నాయాలు అయినా ఆలోచించ గలగాలి. అదీ చేయలేకపోతే బరితెగించేసినట్లుగా ఎవరేమనుకున్నా వినిపించనట్లుగా నడుచుకోవడమే!

ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం సీపీఎస్ రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2019 ఎన్నికల్లో జగన్… సీపీఎస్ రద్దు హామీని ఇచ్చారు. అయితే ఆ హామీని అమలుచేయకుండా.. గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్) ను తెచ్చి పెట్టారు. అయితే దీనిపై ప్రభుత్వం ఉద్యోగులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ పద్దతి వద్దు మొర్రో అని ఉద్యోగులు గొంతెత్తారు.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్… సీపీఎస్ రద్దు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు! దీంతో… 2024 ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగ వర్గం అంతా అవుట్ రేట్ గా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో… కొత్త ప్రభుత్వం ద్వారా సీపీఎస్ రద్దు డిమాండ్ ని నెరవేర్చుకోవాలని ఉద్యోగులు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వలో తమ కోరిక తీరుతుందని భావిస్తున్నారు.

కూటమి అధికారంలోకి రావడంలో తమది కీలక పాత్ర అని బలంగా నమ్ముతున్న ఉద్యోగులు.. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ద్వారా సీపీఎస్ రద్దు డిమాండ్ ని నెరవేర్చుకోవాలని చూశారు. అయితే ఇంకా ఆ విషయంలో అనుకున్నది ఏదీ జరగకముందే… చంద్రబాబు ప్రభుత్వం కూడా జీపీఎస్ కే మొగ్గు చూపుతోంది అని అంటున్నారు.

దీంతో ఉద్యోగ సంఘాల నేతలు అంతా మండిపడుతున్నారని తెలుస్తోంది. జీపీఎస్ వద్దు అంటే దానినే కొత్త ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని అంటున్నారు. తమకు కావాల్సింది జీపీఎస్ లు సీపీఎస్ లు కాదని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని వారు అంటున్నారు. దాని కోసం ఎంతదాకా అయినా వేళ్తామని హెచ్చరిస్తున్నారు.

దీని మీద సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే పోస్టింగుల ఉద్యమం మొదలైంది. దీంతో… సరైన ముహూర్తం చూసుకుని ఉద్యోగులు సమావేశాలు నిర్వహించి కార్యాచరణకు సిద్ధం అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఉద్యోగులు ఎంతో మద్దతు పలికిన కూటమి ప్రభుత్వం వీరికి ఏ మేరకు సహకరిస్తుందనేది వేచి చూడాలి.