ప్రభుత్వ స్ధలంలో టిడిపి కార్యాలయమా ? వెయ్యి రూపాయలు లీజట

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ భూములు, స్ధలాలన్నీ ధారాళంగా ప్రైవేటు సంస్దలు, వ్యక్తుల పరమైపోతున్నాయి. అందుకు తాజా ఉదాహరణే టిడిపి కార్యాలయానికి 93 సెంట్ల జలవరనరుల శాఖ స్ధలం రాసిచ్చేయటం. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను కూడా విడుదల  చేయటంతో చినబాబు లోకేష్ శంకుస్దాపన కూడా చేసేస్తున్నారు. ఎవరేమనుకున్నా, ప్రతిపక్షాలెన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు ఏమాత్రం లెక్క చేయటం లేదు. పచ్చని పంటపొలాలను రాజధాని నిర్మాణం కోసం తీసేసుకున్నారు. ఇతర  ప్రాంతాల్లో కూడా పొలాలను రియల్ ఎస్టేట్ రంగానికి రాసిచ్చేస్తున్నారు.

 

అసలింతకీ విషయం ఏమిటంటే, విజయవాడ నడొబొడ్డున ఆటోనగర్ ఉంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు తప్ప ఇతరత్రా స్ధలాలు ఎవరికీ కేటాయించేందుకు లేదు. ఇక్కడే జలవనరుల శాఖకు 93 సెంట్ల స్ధలం ఉంది. దానిపై కృష్ణ జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చల అర్జునుడి కన్నుపడింది. ఇంకేముంది ? ఆ స్ధలం టిడిపి వశమైపోయింది. జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడ అర్జునుడు నుండి అభ్యర్ధన రావటం, జలవనరుల శాఖ నుండి క్లియరెన్సు వచ్చేయటం అంతా రోజుల్లో అయిపోయింది. ఆటోనగర్ లో  పరిశ్రామిక అవసరాలకు తప్ప ఇతరత్రా ఎవరికీ ఇచ్చేందుకు లేదని తెలిసి కూడా పార్టీకార్యలయ నిర్మాణానికి స్ధలం కేటాయించటం ఆశ్చర్యంగా ఉంది. 

 

జలవనరుల శాఖ క్లియరెన్సు అయిపోగానే చివరకు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా పర్మిషన్ ఇచ్చేసింది. దాంతో ఈరోజు చినబాబు నారా లోకేష్ శంకుస్ధాపన చేస్తున్నారు. విచిత్రమేమిటంటే, 93 సెంట్ల స్ధలం విలువ సుమారు రూ 25 కోట్లుంటుంది. ఇపుడు 33 ఏళ్ళ పాటు టిడిపికి ప్రభుత్వం లీజుకిచ్చేసింది. లీజు కూడా ఏడాదికి వెయ్యి రూపాయలట. పాపం చాలా బీదపార్టీ అని కూడా చూడకుండా ఏడాదికి వెయ్యి రూపాయలు లీజు నిర్ణయిస్తే టిడిపి ఎలా కుతుందని అనుకున్నదో ప్రభుత్వం. ఆ తర్వాత ఆ లీజును 99 ఏళ్ళకు పొడిగించుకునే అవకాశం కూడా ఇచ్చింది లేండి ప్రభుత్వం. ఇంకేదైనా ప్రైవేటు సంస్ధకు లీజుకిస్తే తక్కువలో తక్కువ ఏడాదికి రూ. 30 లక్షలు ప్రభుత్వానికి వస్తుందట.

 

చంద్రబాబు సిఎం అయిన తర్వాత భూ పందేరం చాలా ఎక్కువైపోయింది. విజయవాడ చుట్టుపక్కలే కాకుండా, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి లాంటి అనేక డిమాండ్ ఉన్న అన్నీ ప్రాంతాల్లో వందలాది ఎకరాలను ఎవరికిపడితే వారికి దారా దత్తం చేసేస్తున్నారు. అందుకే బిజెపి, వైసిపి నేతలు అంతలా విరుచుకుపడుతున్నారు. ఇదే విషయమై మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ హై కోర్టులో కేసు కూడా వేసిన విషయం గుర్తుండే ఉంటుంది.