తెలంగాణ నిరుద్యోగులకు TSPSC త్వరలో గుడ్‌న్యూస్

తెలంగాణ నిరుద్యోగులకు టిఎస్ పీఎస్సీ నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ అందనున్నట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి గ్రూపు 1 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలకు రెక్కలోచ్చాయి. కొత్త జోనల్ నిబంధనల ప్రకారం గ్రూపు 1 తో పాటు మిగతా పోస్టులకు ప్రతిపాదనలు వస్తే త్వరలోనే 850 గ్రూపు 1 పోస్టులకు  నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టిఎస్ పీఎస్సీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న గ్రూపు 1 పోస్టుల ప్రతిపాదనకు ఆర్ధిక శాఖ అనుమతి లభించిన మరుక్షణమే టిఎస్ పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రానున్నట్టు తెలుస్తోంది.

గ్రూపు 1 లో దాదాపు 150 పోస్టులను రాష్ట్ర స్థాయి నుంచి మల్టీ జోనల్ కిందకు మార్చాల్సి ఉంది. వాటి ప్రక్రియ పూర్తి కాగానే మిగతా కేటగిరిలకు సంబంధించిన 850 పోస్టులకు నెలరోజుల లోపల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మరో 3 నెలల వరకు టిఎస్ పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉండదు. అందుకే ఎన్నికల నిబంధనలు అమలులోకి రాకముందే నెల లోపల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టిఎస్పీఎస్సీ సమాయత్తమవుతోంది. ఆపద్దర్మ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా క్లియరెన్స్ ఇస్తే టిఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఆపద్దర్మ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ లభించే అవకాశం ఉండటంతో కోర్టు సమస్యలు రాకుండా నోటిఫికేషన్ విడుదలకు టిఎస్ పీఎస్సీ తన పనిని ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నోటిఫికేషన్ విడుదలకు టిఎస్ పీఎస్సీ సిద్దమవుతోంది.  అన్ని కుదిరితే ఈ నెలాఖరుకే నోటిఫికేషన్ విడుదలకు టిఎస్పీఎస్సీ సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిరుద్యోగల జీవితాలతో ఆటలు ఆడకుండా నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని వారు కోరుతున్నారు. 

గ్రూపు 1 నోటిఫికేషన్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా అనేక సమస్యలతో ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన గ్రూపు 1 నోటిఫికేషన్ కోర్టులో ఉంది. కొత్త రాష్ట్రంలో విడుదల చేసిన గ్రూపు 2 నోటిఫికేషన్ కి సంబంధించి పరీక్ష పూర్తయినా ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఫలితాలను విత్ హెల్డ్ లో పెట్టారు. పలువురు గ్రూపు 2 నోటిఫికేషన్ కి సంబంధించి కోర్టును ఆశ్రయించడంతో ఈ చిక్కు ఏర్పడింది. గ్రూపు 1 నోటిఫికేషన్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రూపు 1 నోటిఫికేషన్ పై టిఎస్ పీఎస్సీ లో కదలిక రావడంతో నిరుద్యోగులకు ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త జోన్ల ప్రకారమే నోటిఫికేషన్ రానున్నట్టు సమాచారం. అయితే పోస్టుల సంఖ్య 850 కాకుండా మరిన్ని పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

సివిల్స్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో రాష్ట్ర స్థాయి కేడర్ లో గ్రూపు 1 కి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి పోస్టుల కోసం నిరుద్యోగులు ఏన్నో ఏళ్లుగా కోచింగ్ లు తీసుకుంటూ , కిరాయి రూములల్ల ఉంటూ తిని తినక ఆశలు చంపుకోకుండా చదువుతున్నారు. ఏ పనీ చేయలేక ఆశలు చంపుకోలేక కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూ తమ జీవితాలు గడుపుతున్నారు. ఊరికి దూరంగా పట్నాలల్ల కోచింగ్ లు తీసుకుంటూ చదువుతున్నారు. అయినా కూడా వారి వేదన పట్టించుకోకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయక పోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందారు. ఇప్పటికి  అయినా ప్రభుత్వంలో చలనం వచ్చినందుకు సంతోషిస్తూ పోస్టుల సంఖ్యను పెంచి ఎటువంటి కోర్టు చిక్కులు లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. త్వరలో నే అంటూ ఆశలు పెట్టి నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరాశ పెట్టకుండా సవ్యంగా నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రతిసారీ రేపు మాపు నోటిఫికేషన్ అంటూ ఊరించి నోటి దగ్గరికి వచ్చాక లేదు అన్నట్టు ఈ సారీ కూడా అలా అవుతుందా లేక సవ్యంగానే నోటిఫికేషన్ ఇస్తారా అనే ఆందోళనలో నిరుద్యోగులున్నారు.