ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి దీన్ని గుడ్ న్యూస్ అనే అనాలా? చంద్రబాబు నాయుడు ఊహించని పరిణామం ఇప్పుడు రాష్ర్ట రాజకీయాల్లో చోటు చేసుకుంటుందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్ద ఎత్తున వలసలు జరుగనున్నాయని మీడియా కథనాలు వేడెక్కించిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి దాదాపు ఐదారుగురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కీలక నేతలు వైసీపీలోకి జంప్ అవ్వడానికి రెడీ గా ఉన్నట్లు కథనాలు వెలువ డ్డాయి. మెయిన్ స్ర్టీమ్ మీడియా సైతం ఈ కథనాల్ని అంతే హైలైట్ చేసింది. కొంత మంది ఎమ్మెల్యేలను పేర్లతో సహా అచ్చేసింది.
ఇటీవలే విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీ గూటికి చేరుతున్నట్లు ప్రచారం సాగింది. రేపో మాపో వైసీపీ కండువా కప్పేస్తున్నారంటూ ఇదిగో పులి అదిగో తోక అన్న చందంగా ప్రచారం సాగింది. అయితే వైసీపీలో తాజా పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నుంచి ఇలాంటి సమయంలో బయటకు వెళ్లడం శ్రేయస్కరం కాదని తాజాగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారుట. వైసీపీలో చేరినా ఒరిగేదేంటి? జగన్ పదవులిచ్చి నెత్తిన పెట్టుకుంటారా? అని లోతుగా ఆలోచిస్తే అలాంటిదేమి జరగదని….వెళ్తే రాజకీయంగా ప్రాబల్యం తగ్గుతుందే తప్ప మెరగవ్వదని నిర్ణయాలు మార్చుకున్నట్లు లీకులందుతున్నాయి.
టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన నేతల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని! అన్ని వివరాలు ఆరా తీసిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి ఇదే నిజమైతే చంద్రబాబు దిల్ ఖుష్ అయినట్లే కదా. ఇప్పటికే పార్టీని నేతలు వీడుతున్నారు అన్న కథనాలు చంద్రబాబు కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ రాత్రి ఏ నాయకుడు ఏ పార్టీలోకి వెళ్లిపోతాడో తెలియని సందేహం. మరో వైపు టీడీపీ నేతలపై అరెస్ట్ లు ..పోలీస్ కేసులు…కుంభకోణాలు. మరి ఇలాంటి ప్రతి కూల పరిస్థితుల నడుమ తాజా వార్త చంద్రబాబుకి కాస్త ఊరటనిచ్చేదే కదా.