బాబుకే రివర్సు కొట్టిన జీవో… మారు మాట్లాడని లాయర్!

ఏపీ ముఖ్యమంత్రిని ప్రజాకోర్టులో ఎదుర్కోవడం కంటే… న్యాయస్థానాల్లో ఎదుర్కోవడానికి మొదటినుంచీ ఉత్సాహం చూపిస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ తీసుకున్న ఏ నిర్ణయంపై అయినా.. జగన్ చేసిన ఏ పనిమీదైనా వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో న్యాయస్థానాలనే ఆశ్రయిస్తున్న పరిస్థితి! ఈ క్రమంలో… తాజాగా మరోసారి ప్రజాప్రయోజన వ్యాజ్యం పేరున జగన్ ను ఇరుకునపెట్టాలని ప్రయత్నించిన టీడీపీకి గతంలో బాబు ఇచ్చిన జీవో రివర్స్ కొట్టింది!

వివరాళ్లోకి వెళ్తే… మచిలీపట్నంలో 2 ఎకరాల ప్రభుత్వ స్థ‌లాన్ని వైసీపీ ఆఫీసు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. దీంతో… పార్టీ ఆఫీసుకు ప్రభుత్వ స్థ‌లాన్ని కేటాయించటాన్ని సవాలు చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అది పేరుకు ప్రజాప్రయోజన వ్యాజ్యమే కానీ… ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా దాఖలవుతున్న వ్యాజ్యాల్లో ఎక్కువభాగం టీడీపీ నేతలే వేస్తున్నవి.. వేయిస్తున్నవే! అయితే… ఈ కేసును విచారించిన న్యాయస్థానం… “పార్టీ ఆఫీసుకు ప్రభుత్వ స్థ‌లాన్ని కేటాయించటంలో తప్పేముంది” అని పిటీషనర్‌ ను సూటిగా అడిగింది.

ఆ ప్రశ్నకు… “ప్రభుత్వ స్థ‌లాన్ని పార్టీ ఆఫీసు నిర్మాణానికి కేటాయించటం తప్పు” అని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. దీంతో… “ప్రభుత్వ స్థ‌లాన్ని పార్టీ ఆఫీసుకు కేటాయించే నిర్ణయాన్ని తీసుకున్నది ఎవరు” అని న్యాయస్థానం ప్రశ్నించింది. దాంతో లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. కారణం… ప్రభుత్వ స్థలాలను పార్టీ ఆఫీసులకు కేటాయించొచ్చాంటూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా… చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా 2016లో జీవో-340 రిలీజ్ చేసింది.

అందులో భాగంగా… అప్పట్లో నియోజకవర్గ స్థాయిల్లో కూడా టీడీపీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థ‌లాన్ని తీసుకున్నారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయం పూర్తిగా అధికారంలో ఉన్న టీడీపీకి మాత్రమే అనుకూలంగా ఉండేట్లుగా నిబంధనలు పెట్టారు. అయితే అవే నిబంధనలు 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీకి వర్తిస్తున్నాయి. దీంతో ఆ జీవోతో అడ్వాంటేజ్ తీసుకున్న వైసీపీ కూడా తమ పార్టీ ఆఫీస్ నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించడం మొదలుపెట్టింది.

ఈ విషయాన్నే హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పటి ప్రభుత్వం ఫాలో అవుతున్నది కదా… ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంలో తప్పేమీలేదు.. కావాలంటే జీవోను సవాలు చేయొచ్చు అంటూ న్యాయమూర్తి సూచించారు. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాన్ని కాకుండా జీవోను సవాలు చేస్తే చంద్రబాబు ఇరుక్కుంటారని గ్రహించిన పిటీషనర్ తరుపు న్యాయవాది… మరో ముక్క మాట్లాడకుండా విచారణను వాయిదా వేయించుకున్నారు.