ఆకలి తీర్చేందుకు వినూత్న పథకం పెట్టిన జీహెచ్ ఎంసీ, ఎన్జీవో సంస్థ

జీహెచ్ ఎంసీ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 5 రూపాయలకు భోజనం, నైట్ షెల్టర్లు ఏర్పాటు చేసిన జీహెచ్ ఎంసీ పలు నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా ఓ ఎన్జీవో సంస్థకు వచ్చిన ఆలోచనను వెంటనే ఆచరణ రూపంలో పెట్టింది. దానికి జీహెచ్ ఎంసీ మద్దతుగా నిలిచింది.

నిత్యం హైదరాబాద్ నగరంలో ఎంతో ఆహారం వృథాగా పోతుంది. అదే సమయంలో ఎంతో మంది తినడానికి మెతుకు లేక ఆకలితో అలమటిస్తున్నారు. అటువంటి వారి ఆకలిని తీర్చేందుకు యాపిల్ హోం అనే ఎన్జీవో సంస్థకు ఓ ఐడియా వచ్చింది. నిత్యం టన్నుల కొద్ది ఆహారం, పండ్లు వృథా అవుతుంటాయి. అలా కాకుండా ముఖ్యమైన ప్రదేశాలలో రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేస్తే మిగిలిన ఆహారాన్ని ఎవరైనా వచ్చి అందులో పెట్టవచ్చు.

ఆకలితో ఉన్నవారు అందులో నుంచి తీసుకొవచ్చన్న ఆలోచన వారికి వచ్చింది. దీంతో వారు వెంటనే జీహెచ్ ఎంసీని సంప్రదించారు. వారు రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు చేస్తే దానికి కరెంట్ మరియు ఆహార పదార్థాల సేకరణ బాధ్యత జీహెచ్ ఎంసీ తీసుకుంది. శిల్పరామం, మాదాపూర్ ఏరియాలో జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన వీటిని ప్రారంభించారు. ముఖ్యమైన ఆస్పత్రులు, రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాలలో త్వరలోనే మరిన్ని రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు చేయనున్నారు.

నిత్యం హాస్టళ్లలో, ఫంక్షన్లలో హోటళ్లలో ఆహారం వేస్టు అవుతుంది. ఇక నుంచి అవి వేస్టు కాకుండా ఈ విధంగా ఉపయోగించి నలుగురి ఆకలిని తీర్చనున్నారు. యాపిల్ హోం సంస్థతో పాటు జీహెచ్ ఎంసీని పలువురు అభినందించారు.