బాల్క సుమన్, నల్లాల ఓదేలుకు అగ్ని పరీక్ష

మంచిర్యాల జిలా ఇందారంలో ఉద్రిక్తత ఏర్పడింది. చెన్నూరు టికెట్ నల్లాల ఓదెలుకు ఇవ్వనందుకు నిరసనగా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న గట్టయ్య చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. దీంతో గట్టయ్య చావుకు బాల్క సుమన్, ఓదేలే కారణమని వారిద్దరు వచ్చేంత వరకు గట్టయ్య అంత్యక్రియలు చేయబోమని బంధువులు భీష్మించి కూర్చున్నారు. దీంతో ఇందారంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఈ నెల 12న జైపూర్ మండలం ఇందారంలో ఎంపీ బాల్క సుమన్ ఎన్నికల ప్రచారంలో గట్టయ్య పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో గట్టయ్య సహా 12 మందికి గాయాలయ్యాయి. 80 శాతానికి పైగా కాలిన గాయాలైన గట్టయ్యను మొదట వరంగల్ ఆ తర్వాత హైదరాబాద్ మలక్ పేట యశోద ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ గట్టయ్య మంగళవారం చనిపోయాడు. గట్టయ్య కుటుంబానికి బాల్క సుమన్ రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గట్టయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని నల్లాల ఓదేలు ప్రకటించారు.

గట్టయ్య మృతదేహం

బాల్క సుమన్ ప్రకటించిన ఎక్స్ గ్రేషియా అవసరం లేదని, గట్టయ్య మృతికి కారణమైన నల్లాల ఓదేలు, బాల్క సుమన్ లు ఇద్దరూ ఇందారం రావాల్సిందేనని వారు పట్టుబట్టారు.

వారిద్దరు వచ్చాకనే అంత్యక్రియలు నిర్వహిస్తామని అంత వరకు నిర్వహించమని గట్టయ్య కుటుంబ సభ్యులు, బంధువులు తేల్చి చెప్పారు. వారిద్దరు వచ్చి కుటుంబానికి న్యాయం చేస్తామని హామి ఇచ్చాకే అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ఎన్ని రోజులైనా సరే అప్పటి వరకు అంత్యక్రియలు జరిపేది లేదన్నారు. పోలీసులు గట్టయ్య బంధువులతో చర్చించినప్పటికి ఫలితం లేదు. దీంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలో ఏర్పడింది. పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.