గట్టయ్య భార్యాపిల్లలు కూడా ఆత్మహత్యాయత్నం

విషాదంలో విషాదం అంటే ఇదే. టిఆర్ఎస్ సీట్ల కేటాయింపు చిచ్చుతో గట్టయ్య అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకుున్నారు. తాజాగా గట్టయ్య బాటపట్టారు ఆయన భార్యా బిడ్డలు. వారు ముగ్గురూ ఇంట్లోకి వెళ్లి గ్యాస్ సిలెండర్ లీక్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 

అయితే వెంటనే అందుబాటులో ఉన్న పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి వారిని కాపాడారు.

ఈనెల 12న టిఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గంలోని ఇందారంలో ర్యాలీ చేప్టట్టారు. ఆ ర్యాలీలో గట్టయ్య పెట్రోలో పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నారు. ఆ సమయంలో తనపై హత్యాయత్నం చేశారంటూ గట్టయ్య మీద పోలీసు కేసు పెట్టించారు బాల్క సుమన్. 

వెంటనే గట్టయ్యను వరంగల్ ఆసుపత్రికి తర్వాత హైదరాబాద్ మలక్ పేట యశోదకు తీసుకొచ్చి వైద్యం చేయించారు. కానీ గట్టయ్య కోలుకోలేదు. మంగళవారం మధ్యాహ్నం మరణించారు.

ఈ నేపథ్యంలో బుధవారం ఇందారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గట్టయ్య మృతి కి కారణమైన నల్లాల ఓదేలు, బాల్క సుమన్ గ్రామానికి వచ్చే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని గట్టయ్య కుటుంబసభ్యులు తేల్చి చెప్పారు. పోలీసులు రిక్వెస్ట్ చేసినా అంగీకరించలేదు.

ఇంతలోనే గట్టయ్య భార్య, ఇద్దరు పిల్లలు (పాప, బాబు) ముగ్గురూ ఇంట్లోకి వెళ్లి సిలిండర్ గ్యాస్ రిలీజ్ చేయడం, వెంటనే పోలీసులు తలుపులు పగలగొట్టి కాపాడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

నల్లాల ఓదేలుకు టికెట్ రావాలని తన భర్త ఆత్మహత్యాయత్నం చేస్తే బాల్క సుమన్ తన భర్త మీద హత్యాయత్నం కేసు పెట్టించడం తమను కలిచివేసిందని గట్టయ్య భార్య మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం ఇద్దరూ ఒకటయ్యారని గట్టయ్య బంధువులు అంటున్నారు. వారిద్దరే తమ గట్టయ్య మరణానికి కారణం అని మండిపడుతున్నారు. 

బాల్క సుమన్ ఇచ్చిన ఐదు లక్షల చెక్ తమకు అవసరం లేదని రిజెక్ట్ చేశారు గట్టయ్య కుటుంబసభ్యులు. హత్యానేరం మోపి కేసులు పెట్టించి ఐదు లక్షల చెక్కు ఇస్తే ఎలా తీసుకుంటామని వారు ప్రశ్నించారు.

మరోవైపు దళిత ఉద్యమ నేత, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఇందారంలో పర్యటించి గట్టయ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. శవ రాజకీయాలు చేయడంలో కేసిఆర్ కుటుంబం పెట్టింది పేరు అని మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. గట్టయ్య మృతికి కేసిఆరే కారణం అన్నారు.