కుమారుడితో సహా మాజీ మంత్రి గంటా అరెస్ట్!

ఏపీలో ప్రస్తుతం అరెస్టుల కలకలం మొదలైంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుని పట్టుకెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు… ఆ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరినీ అదుపులోకి తీసుకునే విధంగా పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. ఇందులొ భాగంగా తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్ ని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది.

అవును… స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు… నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ఇదే సమయంలో అనూహ్యంగా మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్ తో పాటు ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేసారు.

చంద్రబాబు హయాంలో గంటా శ్రీనివాస్ విద్యాశాఖ మంత్రిగా పని చేసారు. ఇదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం ఏర్పాటులో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని సీఐడీ, ఈడీ లు ఇప్పటికే పలు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే చంద్రబాబు, గంటాను అరెస్ట్ చేసారు. ఇప్పుడు వీరిద్దరి అరెస్ట్ కు సంబంధించి సీఐడీ అధికారులు కాసేపట్లో మీడియా సమావేశం ద్వారా పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా గంటా శ్రీనివాస్ స్కిల్ డెవలప్ మెంట్ కేంద్ర నిర్వహణలో ప్రమేయంపై ఆరోపణలు ఉన్నాయి.

కాగా… ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబును ఈ తెల్లవారు జామున నంద్యాలలో పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ సమయంలో చంద్రబాబు, పోలీసుల, చంద్రబాబు తరుపు లాయర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోయినా అరెస్ట్ చేయటం ఏంటని ప్రశ్నించారు.

దీని పైన పోలీసు అధికారులు అన్ని వివరాలు హైకోర్టుకు నివేదించామని.. రిమాండ్ రిపోర్టులో అన్ని వివరిస్తామని చంద్రబాబుకు, ఆయన లాయర్లకు వెల్లడించారు. అరెస్ట్ చేసిన చంద్రబాబును వైద్య పరీక్షల అనంతరం నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు.