విశాఖ రాజకీయాల్లో కీలకంగా ఉంటున్న నాయకుడు గంటా శ్రీనివాసరావు. పవర్ పాలిటిక్స్ చేయడంలో ఈయన దిట్ట. అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటారు. అంగ బలం, అర్థ బలం పుష్కలంగా ఉండటంతో ఏ పార్టీ నుండి పోటీకి దిగినా గెలవడం ఈయనకు నల్లేరు మీద నడక లాంటిది. అందుకే అన్ని పార్టీల్లోనూ, అందరి నాయకుల వద్ద ఆయనకు మంచి పలుకుబడి ఉంది. 2014లో టీడీపీ గెలవడంతో మంత్రి పదవి పొంది జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచినా కూడ చేతిలో పవర్ లేకపోవడంతో విలవిల్లాడిపోయారు. ఇక లాభం లేదనుకుని వైసీపీలోకి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు. కానీ గంటా తత్త్వం ఎలాంటిదో తెలిసిన ఆ పార్టీ నాయకులు ఆయనకు అడ్డం తగిలారు.
పార్టీలో ఎంతమంది బడా లీడర్లు ఉన్నా కూడ అధినాయకత్వం వద్ద తనకంటూ సపరేట్ ప్లేస్ సంపాదించుకోవడం గంటా ప్రత్యేకత. అదే విజయసాయిరెడ్డి, ఒకప్పుడు గంటా శిష్యుడిగా ఉన్న అవంతికి నచ్చలేదు. వైసీపీ తరపున విశాఖ రాజకీయాలను మొత్తం వీరిద్దరే ఎక్కువగా చూస్తున్నారు. గంటా పార్టీలోకి వస్తే అది కుదరదు. అంత ఆయనే నడిపిస్తారు. అందుకే అడ్డుపడ్డారు. జగన్ సుముఖంగా ఉన్నా కూడ ఏదో ఒక మెలిక పెట్టి గంటాను నిలువరించారు. గతంలో అనుకున్నదే తడవుగా పార్టీలు మారుతూ వచ్చిన గంటాకు అది నచ్చలేదు. తనకు తానుగా వస్తానంటే ఆపుతారా అంటూ తీవ్రంగా నొచ్చుకున్నారు. అది చాలదన్నట్టు ఆయన భూములను కూడ ఆక్రమణ చేసుకున్నవి అంటూ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. పైగా వైసీపీలో చేరే ప్రయత్నాల్లో టీడీపీకి దూరమవుతూ వచ్చారు. ఒకానొక దశలో చంద్రబాబు నాయుడు సైతం గంటాను బుజ్జగించలేక ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
అలా అటు వైసీపీలోకి ఎంట్రీ దొరక్క, ఇటు టీడీపీకి దూరమవుతూవు నడిమధ్యలో నిలబడిపోయారు ఆయన. దీంతో సహనం నశించి వైసీపీలోకి వెళ్లాలనే ఆలోచనను విరమించుకున్నారు. కానీ అలా విరమించుకుని ఊరుకుంటే ఆయన గంటా ఎందుకవుతారు. అందుకే తనను కాదన్న వైసీపీకి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలను వేదికగా చేసుకుంటున్నారు. అనుకున్నదే తడవుగా తన నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులతో సమావేశం పెట్టుకున్నారు. ఈసమావేశంలో ఒకటే ఎజెండా. అదే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని మట్టికరిపించడం. ఈ మేరకు శ్రేణులకు, అనుచర నాయకులకు యాక్షన్ ప్లాన్ చెప్పారట. ముందుగా తన నియోజకవర్గంలో కార్పొరేటర్ అభ్యర్థులుగా బలమైన నాయకులను ఎంపిక చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు.
పోటీలో నిలవబోయే టీడీపీ అభ్యర్థి ఒక్కరు కూడ ఓడిపోవడానికి వీల్లేదని గట్టిగా చెప్పారట. తనను కూడ అందరి నాయకులను చూసినట్టే సాధారణ రీతిలో చూసి పార్టీ బయట నిలబెట్టిన వైసీపీకి తాను అనుకుంటే ఏం చేయగలనో చూపించాలని భావిస్తున్నారట. దాంతో పాటే చంద్రబాబు నాయుడు వద్ద డ్యామేజ్ అయిన తన ఇమేజ్ ను మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు అందివ్వడం ద్వారా మెరుగుపర్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారట . మొత్తానికి ఒక్క దెబ్బ రెండు పిట్టలు అన్నట్టు జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి అటు వైసీపీకి షాక్ ట్రీట్మెంట్ ఇటు టీడీపీని సప్రైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడమే గంటా ప్రధాన ఉద్దేశ్యం.