గతకొంతకాలంగా విశాఖ టీడీపీలో అయన్నపాత్రుడి హడావిడి మామూలుగా ఉండేది కాదు. రాష్ట్రంలో ఎక్కడ టీడీపీ సభ జరిగినా అక్కడ వాలిపోయేటంత ఉత్సాహంలో అయ్యన్న ఉండేవారు. విశాఖ టీడీపీలో ఇక తనకు తిరిగులేదన్నట్లుగా వ్యవహరించేవారు. నోటికి ఏమాత్రం అడ్డూ అదుపూ లేకుండా ప్రసంగాలు చేసేవారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి అసభ్యపదజాలలను సైతం ఆశ్రయించే సాహసం చేశారు. ఏకంగా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని “నా కొడకా” అని తిట్టి.. అనంతరం, ఇంగ్లిష్ లో “మై సన్” అని సంభోదించానంటూ కవర్ చేసుకునేటంత మూర్ఖంగా ముందుకుపోయారు. అయితే… గత కొన్ని రోజులుగా ఈ ఉత్సాహం కనిపించకుండా పోయింది.
విశాఖ టీడీపీ నాదే అన్నట్లుగా ఇంతకాలం యవ్వారాలు సాగించిన అయ్యన్న & కో గతకొన్ని రోజులుగా కనబడుటలేదంట. దానికి కారణం… గంటా శ్రీనివాస రావు అని అంటున్నారు తమ్ముళ్లు. అవును… నాలుగేళ్ల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా.. మరోవైపు నియోజకవర్గంలోనూ పెద్దగా యాక్టివ్ గా లేకుండా ఇంతకాలం నల్లపూసైపోయిన గంటా శ్రీనివాస్… తాజాగా తెరపైకి వచ్చారు. ఇప్పుడు ఇదే… అయన్న మౌనానికి కారణం అని చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తొలుత ఒక మహిళను చంద్రబాబు ఎంపిక చేశారు. అయితే చివరి నిమిషంలో ఆమెను మార్చి చిరంజీవి రావు పేరును సూచించింది గంటా శ్రీనివాసరావే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను గెలిపించుకువస్తానని కూడా చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే గంటా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాక్టివ్ అయ్యారని.. సక్సెస్ కూడా అయ్యారని అంటున్నారు. దీనితోపాటు… కాపు సామాజికవర్గానికి చెందిన బలమైన నేత కావడం, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి నారాయణకు వియ్యంకుడు కావడంతో చంద్రబాబు మళ్లీ గంటాను చేరదీయడం మొదలుపెట్టారని అంటున్నారు.
దీంతో రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర టీడీపీలో అచ్చెన్న తర్వాత తానే చక్రం తిప్పేదని.. ఇక విశాఖ టీడీపీ విషయనికొస్తే.. అంతా తానే అవుతామని భావించిన అయ్యన్నకు… గంటా దెబ్బ గట్టిగానే తగిలిందని.. దెబ్బకు సైలంట్ అయిపోయారని.. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశాలున్నాయని అంటున్నారు తమ్ముళ్లు. మరి అయ్యన్న త్వరగా తేరుకుంటారా.. లేక, ఇలా అలక పానుపు పైనుంచే రాజకీయాలనుంచి నిష్క్రమిస్తారా అన్నది వేచి చూడాలి!