టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీ నాయకులని అయోమయ పరిస్థితుల్లోకి నెడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ, స్పీకర్ తమ్మనేని సీతారాంకి రాజీనామా లేఖను పంపిన విషయం విదితమే. ఆ లేఖ చెల్లదంటూ జరిగిన రచ్చ గురించి కూడా అందరికి తెలిసిందే. తాజాగా మరోమారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న జేఏసీ సమక్షంలో.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తూ, ఆ లేఖని మీడియాకి చూపించారు గంటా శ్రీనివాసరావు.
ఇంతవరకు బాగేనే ఉన్నా అదే వేదికపై మరోపక్క, వైసీపీ నేత మంత్రి అవంతి శ్రీనివాస్ ఉండటమే ఇప్పుడు సరికొత్త అనుమానాలకు దారితీస్తుంది . ఒకప్పుడు గంటా, అవంతి.. తెలుగుదేశం పార్టీలో మిత్రులే. ఆ తర్వాత గంటా, అవంతి కలిసే వైసీపీలోకి వెళ్ళాలనుకున్నారుగానీ, గంటా చేరిక ఆలస్యమయ్యింది. ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి గెలిచారు. అవంతికి అదృష్టం కలిసొచ్చి అధికార ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఒకవేళ గంటా, వైసీపీలో చేరి వుంటే అవంతికి మంత్రిగా ఛాన్స్ దక్కి వుండేది కాదేమో.
వైసీపీలోకి వెళ్లేందుకు గంటా చేసిన ప్రయత్నాల మీద అవంతి అనేక రకాలుగా నీళ్లు చల్లి అడ్డుకున్నారని వైసీపీ నాయకులే ప్రస్తావించటం జరిగింది. కానీ, పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయి. సీపీఐ నారాయణ, అటు మంత్రి అవంతి, ఇటు మాజీ మంత్రి గంటాను కలిపారు. ఇద్దరూ కలిసి చంద్రబాబు, వైఎస్ జగన్‌ని కలపాలనీ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్, చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చేలా చూడాలంటూ గంటా, అవంతిలకు సూచించారు.
ఆత్మీయ పలకరింపులు లేకపోయినా, మొహమాటంగానే అయినా గంటా, అవంతి కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విశాఖ నగరంలో ఈ కలయిక రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. గంటాను అవంతి, వైసీపీలోకి ఆహ్వానిస్తారా ? వేరే ఆలోచన ఏమైనా ఈ ఇద్దరూ చేస్తారా ? అంటూ ఆసక్తకిరమైన చర్చ జరుగుతోంది. ఉక్కు పరిశ్రమ వ్యవహారంలో కలిసి పోరాటం చేసేందుకు అన్నట్లుగా వీరు కలరింగ్ ఇస్తున్నా లోపల చాలా జరుగుతున్నాయని తెలుస్తుంది.