టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ లో ఆయనకు బిగ్ షాక్ తగిలే అవకాశాలున్నాయి. గత 2014 ఎన్నికల్లో కేసిఆర్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన తూంకుంట నర్సారెడ్డి కేసిఆర్ కు షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కు అత్యంత సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
గురువారం సాయంత్రం తూంకుంట నర్సారెడ్డి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయినట్లు తెలిసింది. ఈ సమావేశంలో గజ్వేల్ ప్రస్తుత కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నారు. అంతకంటే ముందు సాయంత్రం 5 గంటలకు వంటేరు ప్రతాపరెడ్డి, నర్సారెడ్డి ఇద్దరూ కలిసి సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతిని కలిశారు. ఈ సమావేశం అనంతరం ఉత్తమ్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
నర్సారెడ్డి ఇంటికి వెళ్లి కలిసిన ఉత్తమ్ పాత ఫొటో
ఈరోజు రాత్రి వరకు తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునే చాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తూంకుంట నర్సారెడ్డి ఎప్పటినుంచో కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం సాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
లేదు లేదంటూనే కాంగ్రెస్ లోకి…
తూంకుంట నర్సారెడ్డి గతంలోనే కాంగ్రెస్ పార్టీలోకి పోతాడని ప్రచారం సాగింది. ఆయన యాక్సిడెంట్ అయిన సందర్భంలో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ సమావేశంలో గతంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న వంటేరు ప్రతాపరెడ్డి కూడా పాల్గొన్నారు. అప్పుడే కాంగ్రెస్ లోకి నర్సారెడ్డి వెళ్లే చాన్స్ ఉందని ప్రచారం సాగింది. కానీ పెండింగ్ లో పడింది.
అయితే నర్సారెడ్డి 2014 ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం లో ఆయనకు టిఎస్ఆర్ డీసి ఛైర్మన్ పదవి ఇచ్చారు. కానీ గజ్వేల్ లో ఆయనకు సరైన గుర్తింపు, గౌరవం లేదన్న ప్రచారం ఉంది. పేరుకే ఛైర్మన్ పదవి ఇచ్చానా ఆమేరకు గౌరవం మాత్రం లేదని, తన వర్గం వారికి టిఆర్ఎస్ లో గుర్తింపు కూడా లేదని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు ప్రచారం సాగింది.
కానీ తూంకుంట నర్సారెడ్డి స్వయంగా పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు కూడా టిఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై టిఆర్ఎస్ నజర్ వేసింది. ఏ క్షణంలోనైనా గజ్వేల్ లో టిఆర్ఎస్ కు నర్సారెడ్డి గుడ్ బై చెప్పవచ్చని అనుమానించింది టిఆర్ఎస్. ఆయన పార్టీ వీడినా లైట్ తీసుకోవాలని పార్టీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది.
నేను టిఆర్ఎస్ లోనే ఉంటా : నర్సారెడ్డి
నర్సారెడ్డి పార్టీ మారే విషయమై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈరోజు సాయంత్రం మీడియాలో వార్తలు రావడంతో తూంకుంట నర్సారెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ లోకి పోతానన్న వార్తల్లో నిజం లేదన్నారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తనకు చాలా ఆప్త మిత్రురాలని చెప్పారు. ఆమెను తాను తరచుగా కలుస్తూ ఉంటానని వివరణ ఇచ్చారు. కానీ పార్టీ మారే విషయంలో వాస్తవం లేదన్నారు. తాను టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
టివీల్లో మారుమోగిన నర్సారెడ్డి భేటీ వివరాలు :
గజ్వేల్ నర్సారెడ్డి కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ అయినట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో స్క్రోలింగ్ ల రూపంలో మారుమోగింది. తొలుత కాంగ్రెస్ లోకి గజ్వేల్ నర్సారెడ్డి అని వార్తలిచ్చాయి. తర్వాత నర్సారెడ్డి ప్రకటనలు కూడా ప్రత్యక్షమయ్యాయి. తాను కాంగ్రెస్ లోకి పోతానన్న వార్తల్లో వాస్తవం లేదని నర్సారెడ్డి పేరుతో ప్రకటనలు వచ్చాయి. టిఆర్ఎస్ లోనే ఉంటానని వార్తలొచ్చాయి. టివి స్క్రోలింగ్స్ తాలూకు వివరాలు కింద ఉన్నాయి.