సిల్లీ గాసిప్.! కొడాలి నానికి టిక్కెట్ కష్టమేనట.!

మాజీ మంత్రి, వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు పడదా.? కొడాలి నానికి టిక్కెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుముఖంగా లేరా.? అసలు ఈ చర్చ ఎందుకు తెరపైకొస్తోంది.? వైసీపీలో చాపకింద నీరులా ఈ గాసిప్ పాకేస్తోంది.

టీడీపీ నుంచి కొడాలి నాని రాజకీయ జీవితం ప్రారంభమైంది. కానీ, ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారారు. స్వర్గీయ ఎన్టీయార్ భక్తుడు కొడాలి నాని కాస్తా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద కూడా అమితమైన భక్తిని పెంచుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఎవరన్నా విమర్శలు చేస్తే, బూతులతో చెలరేగిపోతారు నాని.

అయినాగానీ, కొడాలి నానికి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఇంకోసారి అవకాశం దక్కలేదు. దాంతో, ఆయన లోలోపల కాస్త నొచ్చుకున్నా, ఆ తర్వాత సర్దుకున్నారు. 2024 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో మళ్ళీ గెలిచి, మంత్రినవుతానని అంటున్నారు కొడాలి నాని.

అయితే, కొడాలి నాని మీడియా ముందు పులి.. నియోజకవర్గంలో మాత్రం ‘పిల్లి’ అన్నట్టు తయారైంది పరిస్థితి.. అంటూ వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో కోడి పందాలు, కాసినో వ్యవహారాల గురించి మాట్లాడుతూ, ‘పండగ వేళ అలాంటివి లేకపోతే జనం ప్రజా ప్రతినిథుల్ని నిలదీస్తారు..’ అంటూ గుడివాడ ప్రజానీకాన్ని అవమానించారన్న విమర్శలు అప్పట్లో విపక్షాల నుంచి వినిపించిన సంగతి తెలిసిందే.

గుడివాడలో కొడాలి నానిని ఢీకొట్టే రాజకీయ ప్రత్యర్థి అయితే ప్రస్తుతానికి ఇతర పార్టీల్లో ఎవరూ లేరు. అయినాగానీ, స్థానికంగా నాని పట్ల వ్యతిరేకత పెరుగుతోందని వైసీపీ అధిష్టానానికి కూడా రిపోర్టులు అందుతున్నాయట. అయినాసరే, నానిని వదులుకునేందుకు వైసీపీ అధినేత అస్సలు ఇష్టపడరు. మరి, ఈ సిల్లీ గాసిప్స్ ఎలా వస్తున్నాయ్.? అదైతే మిలియన్ డాలర్ క్వశ్చన్ ప్రస్తుతానికి. వైసీపీలోనే నానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తున్నారా.?