తాజాగా జరిగిన రెండు దశల పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ తన హవాను కొనసాగించింది. తొలి దశ, రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ మెజార్టీ పంచాయతీలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అందులో సగం స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది. టీడీపీకి పట్టున్న జిల్లాల్లోనూ వైసీపీ తన సత్తాను చాటడం గమనార్మం. అనంతపురం జిల్లాలో గత మూడు దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేదు.
కానీ, తాజాగా, జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాత్రం భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో మెజార్టీ స్థానాలను వైసీపీ మద్దతుదారులే దక్కించుకున్నారు. దీంతో తమకు పట్టున్న జిల్లాలోనూ ఇలాంటి పలితాలు రావడంతో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్లయింది. తెలుగుదేం పార్టీ, పరిటాల కుటుంబానికి మంచిపట్టున్న రాప్తాడు, ధర్మవరం, కళ్యానదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచులుగా గెలుపొందడం గమనార్హం. రాప్తాడులో మొత్తం 58 సర్పంచ్ స్థానాలుండగా, 53 గ్రామ పంచాయతీల్లో కూడా వైసీపీ మద్దతుదారులే విజయ పతాక ఎగురవేశారు.
పరిటాల రవీంద్ర సొంత మండలమైన రామగిరిలో కూడా తెలుగుదేశం పార్టీ తిరిగి తన పంచాయతీ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. రామగిరిలో వైసీపీ 7 పంచాయతీలను కైవసం చేసుకోగా, తెలుగుదేశం కేవలం రెండు స్థానాల్లోనే గెలుపొందింది. రాప్తాడు వైయస్సార్సీపీ ఎమ్మెల్యే టీ ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల స్వేచ్ఛగా జరిగాయన్నారు. ఈసారి పరిటాల కుటుంబం ప్రభావం పనిచేయలేదన్నారు. జగన్ సర్కారు తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ పథకాల కారణంగానే ప్రజలు తమ పార్టీ మద్దతుదారులకు పట్టం కట్టారని చెప్పుకొచ్చారు.