విమానాశ్రయానికి శంకుస్థాపన.! ఇంకోసారి ఎందుకు.?

భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదేంటీ, నాలుగేళ్ళ క్రితమే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ఇదే విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు కదా.! ఇది రాజకీయం.. ఇదిలాగే వుంటుంది.

పోలవరం ప్రాజెక్టు పేరుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఎన్ని పబ్లిసిటీ స్టంట్లు చేశారో చూశాం.! సో, వాటితో పోల్చితే, వైఎస్ జగన్ చేస్తున్న ‘మళ్ళీ’ శంకుస్థాపనల్ని పెద్ద వింతగా చూడాల్సిన పనిలేదేమో.!

కానీ, కడప ఉక్కు పరిశ్రమకు వైఎస్ జగన్ హయాంలోనే శంకుస్థాపనలు, భూమి పూజలు.. పలు మార్లు జరిగాయ్.! ఇక ముందు కూడా జరుగుతూనే వుంటాయేమో.! ఇవన్నీ ప్రజాధనంతో ముడిపడి వున్న విషయాలు. బోల్డంత ఖర్చవుతుంది శంకుస్థాపనలంటే.! భూమి పజల సంగతి సరే సరి.!

చంద్రబాబు కంటే తాను భిన్నం.. అని చెప్పుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంకోసారి శంకుస్థాపనలు చేయడం ద్వారా ఏం సంకేతాలు పంపుతున్నట్లు.? తాను కూడా ఆ తానులోని గుడ్డ పీలికనే.. అన్నట్లు వ్యవహరిస్తే ఎలా.?

విశాఖ విమానాశ్రయం, నేవీ ఆధీనంలో వుంది. దాంతో, విమానాశ్రయ విస్తరణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే, విశాఖ సమీపంలో భోగాపురం విమానాశ్రయం అవసరం ఏర్పడింది.