Anil Kumar Yadav: వైకాపా నుంచి ఎంతోమంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్తూ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇస్తున్నారు. ఇలా ఒక రోజులోనే ఏకంగా ముగ్గురు మాజీ మంత్రులు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం ఊహించని షాక్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే మరో మాజీ మంత్రి సైతం జగన్మోహన్ రెడ్డి విషయంలో బాగా అలిగారని తెలుస్తోంది. మరి ఆయన ఎవరో కాదు వైసిపి ఫైర్ బ్రాండ్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్.
గతంలో అనిల్ కుమార్ యాదవ్ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి కానీ ఆయన మాత్రం నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు నేను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ మాత్రమే ఆయన ఎక్కడ ఉంటే చివరి వరకు నేను కూడా అక్కడే ఉంటానని అనిల్ తెలిపారు. ఇలా జగన్మోహన్ రెడ్డి వెంటే తాను అంటూ పలు సందర్భాలలో తెలియ చేస్తున్న ఈయన మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
ఇలా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటానికి కారణం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేశారు. రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా విభజించి సమన్వయకర్తలను నియమించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అయితే రీజనల్ కోఆర్డినేటర్ పదవిని ఆశించారు అనిల్ కుమార్ యాదవ్. ఆపై తాను ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని భావించారు.
ఇలాంటి బాధ్యతలు అనిల్ కుమార్ యాదవ్ కి అప్పగించకపోవడం పట్ల ఆయన అలిగారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే జగన్ అనిల్ కుమార్ కు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి పొలిట్ బ్యూరో మాదిరిగా.. వైసీపీకి పిఎసి ఉంది. ఈ కమిటీలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉంటారు. అలాంటి వారిలో ఈయనకు కూడా చోటు కల్పించబోతున్నారని సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం పట్ల నెల్లూరు జిల్లా వైకాపా నేతలు వ్యతిరేకత చూపుతున్నారు నెల్లూరులో వైకాపా ఓడిపోవడానికి అనిల్ కుమార్ దూకుడే కారణమని పలువురు ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.