మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు చాలా తెలివైనోడనిపించుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి గెలిచే అవకాశాలు తక్కువనేట్లుగా ఉంది పరిస్ధితులు. భారతీయ జనతా పార్టీకి అసలు డిపాజిట్ కూడా దక్కుతుందో లేదో తెలీదు. ఇటువంటి పరిస్ధితుల్లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను జాగ్రత్తగా గమనించినట్లున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని ప్రకటించేశారు. అయితే ప్రజా సేవ మాత్రం చేస్తాననే బంపర్ ఆఫర్ ప్రకటించేశారు.
నిజానికి కామినేని టిడిపి నేతే. కాకపోతే చంద్రబాబునాయుడే చెప్పి 2014 ఎన్నికల సమయంలో కామినేనిని బిజెపిలోకి పంపారు. దాంతో బిజెపి నేత అవతారం ఎత్తిన కామినేని పొత్తుల్లో భాగంగా మిత్రపక్షం అభ్యర్ధిగా కృష్ణా జిల్లా కైకలూరు నుండి పోటీ చేసి గెలిచారు. ఎటు చంద్రబాబు, బిజెపి నేత వెంకయ్యనాయుడు మనిషే కావటంతో స్నేహధర్మమనే ముసుగులో ఏకంగా మంత్రి పదవినే దక్కించుకున్నారు. సరే ఎప్పుడైతే టిడిపి, బిజెపిలు వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకోగానే నైతికత ముసుగులో మంత్రిపదవికి రాజీనామా చేసేశారు.
విచిత్రమేమిటంటే, కామినేని పేరుకు బిజెపి నేతే అయినా తరచూ చంద్రబాబును కలుస్తునే ఉన్నారు. అందుకనే కామినేని బిజిపిని వదిలేసి టిడిపిలో చేరుతారనే ప్రచారం బాగా ఉంది. చివరకు చూస్తే తానసలు ఎన్నికల్లో పోటీ చేసేదే లేదని కామినేని తేల్చి చెప్పేశారు. కామినేని పోటీ అంటూ చేస్తే ఇటు బిజెపి తరపునో లేకపోతే టిడిపి తరపునో పోటీ చేయాలి. రెండింటిలో ఏ పార్టీ తరపున పోటీ చేసినా గెలుపు అనుమానమే అని అర్ధమైందేమో ? అందుకనే తెలివిగా ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం ప్రజాసేవ మాత్రమే చేస్తానని టచ్ ఇచ్చారు.