వివేకా పాత్ర పోషించనున్న డిఎల్, త్వరలో వైసిపిలోకి

 త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ప్రకటించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి బుధవారం ఉదయం ఖాజీపేటలో డీఎల్‌ రవీంద్రారెడ్డిని కలియడంతో చాలా కాలంగా ఉన్న సస్పెన్స్ తొలగిపోయింది.

జిల్లాలో ఎటూ పోకుండా మిగిలిపోయిన సీనియర్ నాయకుడు ఆయనే.

ఆయన సహచరులంతా ఎటో ఒక వైపు అడ్జస్టు అయిపోయారు. ఆయన తెలుగుదేశంలో చేరతాడనే వార్తలు వచ్చాయి. అది వీలు కాలేదు. చివరకు, ఆ మధ్య ఏది ఏమయినా సరే చంద్రబాబు ను ఓడించేందుకు కృషి చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు.

ఈనేపథ్యంలో ఈ రోజు వైసిపి సీనియర్ నేతలు డిఎల్ ఇంటికి రావడం విశేషం.

ఈ సమావేశం అనంతరం డీఎల్‌ మాట్లాడుతూ…‘వైఎస్‌ జగన్ నాకు ఫోన్‌ చేశారు. మీ సేవలు అవసరం పార్టీలోకి రావాలని కోరారు. చాలా సంవత్సరాలుగా వైఎస్‌ ఆర్‌ కుటుంబసభ్యుడిని. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటా. పది రోజుల్లో భారీ సమావేశం ఏర్పాటు చేస్తా. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ గెలుపు కోసం కృషి చేస్తా. వైఎస్‌ వివేకానందరెడ్డి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్‌ కోరారు’ అని డిఎల్ తెలిపారు.

సజ్జల రామకృష్ష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎల్‌ రవీంద్రారెడ్డి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఆయన రాకతో పార్టీలో నూతన ఉత్సహం వస్తుందని చెబుతూ అధికారంలోకి రాగానే డీఎల్‌కు ప్రత్యేక స్థానం ఇస్తామని వైఎస్‌ జగన్ చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన‍్నారు.

కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ మా చిన్నాన్న లేని లోటు డీఎల్‌ రవీంద్రారెడ్డి తీరుస్తారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే శివ రామకృష్ణయ్య కూడా పార్టీలోకి రావడం శుభ పరిణామం అని అన్నారు.