వరద రాజకీయం.! గెలిచేదెవరు.? ఓడేదెవరు.?

Flood Politics

వరదొస్తే, బురద వస్తుందో రాదోగానీ.. రాజకీయ బురద అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రాజకీయం అంటేనే అంత. వరదల వేళ, ముంపు ప్రాంతాల్లో రాజకీయ నాయకులు పర్యటించడం, బాధితులకు భరోసా ఇవ్వడం కొత్త విషయమేమీ కాదు. కానీ, ఆ భరోసా వెనుక రాజకీయం ప్రతిసారీ వెర్రి తలలు వేస్తూనే వుంటుంది.

అధికారంలో వున్నప్పుడు ఒక మాట, అధికారం లేకపోతే ఇంకో మాట.! వరద ముంపు ప్రాంతాల్లో ఏ బాధితుడిని అడిగినా ఈ వరద రాజకీయం గురించి బహు గొప్పగా చెబుతాడు.. కంటతడి పెడతాడు కూడా.

వరదల వేళ, తాము ప్రజల్ని ఉద్ధరించేశామని చెప్పని అధికార పార్టీ నాయకుడుంటాడా.? అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, ఇంకొక పార్టీ అయినా.. అదే తీరు. బ్రిడ్జి కట్టేస్తాం, వరద రాకుండా అడ్డు కట్ట నిర్మించేస్తాం.. అని చెబుతూనే వుంటారు. ఆ తర్వాత మామూలే.

ఏడాదికి ఓ సారో, రెండు సార్లో వరద వస్తుంది.. ఆ సమయంలోనే ఈ బురద రాజకీయాలూ వస్తుంటాయ్.. ఆ తర్వాత అంతా మామూలే. వరదలొచ్చినప్పుడు సర్వం కోల్పోవడం, ఆ తర్వాత శక్తినంతా కూడదీసుకుని, జీవితాన్ని పునర్నిర్మించుకోవడం వదర బాధితులకు అలవాటైపోయింది.

నాలుగు ఆలుగడ్డలు, నాలుగు ఉల్లిపాయలు.. అంటూ తాజాగా ఏపీలో వరద రాజకీయం నడుస్తోంది. గతంలో ఏం చేశారు.? ఇప్పుడేం చేశారు.? అని ఒక్కసారి తరచి చూస్తే, ‘బిచ్చం స్థాయి’ పెరుగుతుందేమోగానీ, బాధ్యత మాత్రం కనిపించదని వరద బాధితులే చెబుతున్న పరిస్థితి.