IPS Sanjay Remanded : ఫైర్ సర్వీసెస్ మాజీ డీజీ సంజయ్‌కు 14 రోజుల రిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫైర్ డిపార్ట్‌మెంట్ అవకతవకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఫైర్ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ జనరల్ (డీజీ) పీఎస్ఆర్ ఆంజనేయ సంజయ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఆయన న్యాయస్థానం ఎదుట లొంగిపోయారు.

వివరాల్లోకి వెళితే… గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫైర్ సర్వీసెస్ డీజీగా, ఆ తర్వాత సీఐడీ చీఫ్‌గా సంజయ్ పనిచేశారు. ఫైర్ సర్వీసెస్ విభాగంలో ఎన్ఓసీల జారీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అవగాహన కార్యక్రమాల కోసం ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఆయనపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్, ముందస్తు బెయిల్ కోసం తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 30న హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఏసీబీ అధికారులు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం, హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. మూడు వారాల్లోగా ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని, ఆ తర్వాతే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు గడువు ముగుస్తుండటంతో సంజయ్ మంగళవారం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సంజయ్‌కు సెప్టెంబర్ 8వ తేదీ వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ జిల్లా కారాగారానికి తరలించారు.

Pepakayala Ramakrishna Analysis On Rahul Gandhi Vs Election Commission Of India || Vote Chori || TR