జైల్లో గంజాయి, పెన్ కెమెరా… జడ్జికి బాబు సంచలన లేఖ!

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు… రాజమండ్రి జైల్లో సుమారు 47 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన భద్రతపై టీడీపీ నేతలు ఇప్పటికే పలు సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జైల్లో నేరస్తులు ఉన్నారని, నక్సలైంట్లు ఉన్నారని, వారితో బాబు భద్రతకు ముప్పు అని సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో… తాజాగా చంద్రబాబు కూడా తన భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు.

ఈ నెల 25న ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన మూడు పేజీల లేఖలో చంద్రబాబు పలు అంశాలు ప్రస్తావించారు. తనను అరెస్టు చేసి 11న రాజమండ్రి జైలుకు రిమాండ్ కు పంపారని తెలిపిన చంద్రబాబు… జైల్లోకి తాను ప్రవేశిస్తున్న సమయంలో తన ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని.. తద్వారా తన ప్రతిష్టను మంటగలిపారని లేఖలో తెలిపారు. ఇదే సమయంలో తనను కలవడానికి ములాకత్ కు వస్తున్న వారి ఫోటోలను, వీడియోలను కూడా తీస్తున్నారని తెలిపారు.

ఇదే క్రమంలో… తనను హతమార్చేందుకు ఓ వామపక్ష తీవ్రవాద సంస్ధ కుట్ర పన్నిందని, దీనికోసం భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తనకు తెలిసిందని చంద్రబాబు వెల్లడించారు. దీనిపై పోలీసులు అధికారులు స్పందించలేదని, ఆ లేఖపై ఇప్పటివరకూ ఎలాంటి విచారణా జరపలేదని బాబు ఆ లేఖలో ఆరోపించారు. ఇదే సమయంలో… రిమాండ్ ఖైదీగా ఉన్న ఒక వ్యక్తి పెన్ కెమెరాతో జైల్లో సంచరిస్తూ తోటి ఖైదీల ఫొటోలు తీస్తున్నాడని, ఆ విషయం తనకు తెలిసిందని బాబు ఈ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు.

అలాగే రాజమండ్రి జైలుపై ఓ డ్రోన్ కెమెరా సంచరిస్తూ తమ ఫొటోలు, వీడియోలు తీస్తోందని, అయినా జైలు అధికారులు కానీ, పోలీసులు కానీ దాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జైల్లో గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని, ఇక్కడున్న 2200 మంది ఖైదీలలో సుమారు 750 మంది తీవ్ర ఆరోపణలు ఉన్నవారు ఉన్నారని.. ఇవన్నీ తన భద్రతకు ముప్పుగా మారాయని బాబు పేర్కొన్నారు.

ఈ పరిణామాల్ని అన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి జైల్లో తనకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని చంద్రబాబు విజయ్వాడ ఏసీబీ కోర్టు జడ్జిని తన లేఖలో కోరారు.