ఎట్టకేలకు బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మినారాయణ

ముసుగులో గుద్దులాట లేదిక.! మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. కన్నా లక్ష్మినారాయణతోపాటు ఆయన అనుచరులూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు ‘కమలం’ పార్టీకి. 2019 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రావడంతోనే కన్నా లక్ష్మినారాయణకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది. అప్పట్లో ఈ విషయమై బీజేపీలో ఓ వర్గం కొంత అసహనం వ్యక్తం చేసిన మాట కూడా వాస్తవం. ఎప్పటినుంచో బీజేపీని నమ్ముకున్నవారికి కాకుండా, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మినారాయణకు ఎలా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారని కొందరు కరడుగట్టిన బీజేపీ వాదులు గుస్సా అయ్యారు.

ఆ సంగతి పక్కన పెడితే, కన్నా లక్ష్మినారాయణ నేతృత్వంలో పలువురు వేరే పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీ వైపు వచ్చిన మాట వాస్తవం. కానీ, కన్నా లక్ష్మినారాయణ బీజేపీలో టీడీపీ ‘సానుభూతి పరుల గ్రూపు’ నడుపుతున్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన్ని తొలగించి, సోము వీర్రాజుని రంగంలోకి దించింది బీజేపీ అధిష్టానం.

అప్పటినుంచీ సోము వీర్రాజుపై గుర్రుగానే వున్నారు కన్నా లక్ష్మినారాయణ. ఈ మధ్య నేరుగా సోము వీర్రాజుపై విమర్శలు చేస్తూ వార్తల్లోకెక్కడం మొదలు పెట్టిన మాజీ మంత్రి కన్నా, చివరికి బీజేపీకి రాజీనామా చేయక తప్పలేదు. జనసేనతో టచ్‌లోకి గతంలోనే కన్నా వెళ్ళారుగానీ, జనసేన మీద నమ్మకాల్లేక.. ఆయన టీడీపీ వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అతి త్వరలోనే చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మినారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారట. ప్రధాని మోడీ పట్ల తనకు అమితమైన గౌరవం వుందనీ, ఎప్పటికీ ఆయన అంటే అదే గౌరవం వుంటుందనీ కన్నా చెప్పడం గమనార్హం. సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాల వల్లనే ఏపీలో బీజేపీకి ఎదుగూ బొదుగూ లేకుండా పోయిందని కన్నా లక్ష్మినారాయణ చెప్పుకొచ్చారు.

ఏ పార్టీలో చేరేదీ ఇంకా నిర్ణయించుకోలేదని కన్నా చెబుతున్నా, ఆయన టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది.