145 – 30: టీడీపీ – జనసేన సీట్ల పంపకం ఫైనల్?

నేటితో తెలంగాణలో ఎన్నికల సందడి పూర్తయ్యింది. ఆదివారం ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో… ఆ ఫలితాల అనంతరం ఇక తెలుగు ప్రజల దృష్టంతా ఏపీ రాజకీయాలపైనే ఉంటుందనడంలో సందేహం ఉండకపోవచ్చు. ఈ సమయంలో చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో బెయిల్ దొరకడంతో రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో జనసేనతో సీట్ల పంపకాలపై ఒక క్లారిటీకి వచ్చారని సమాచారం.

అవును… తెలంగాణ ఎన్నికల సందడి మూగియనుండటంతో.. ఆదివారం ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాలపైనే చర్చ మొదలవ్వబోతోంది. ఈ క్రమంలో ఈసారి పొత్తులో కలిసి పోటీచేయబోతున్న టీడీపీ – జనసేన మధ్య సీట్ల సర్ధుబాటు ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. రాబోయే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీని గద్దె దింపాలని బలంగా ఫిక్సయిన ఈ రెండు పార్టీల తొలి అడుగు ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది.

ఈ క్రమంలో టీడీపీ – జనసేన మధ్య సీట్ల సర్ధుబాటు విషయంలో ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తుంది. ఇందులో భాగంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు 30 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు టీడీపీ కేటాయించడానికి ఫిక్సయినట్లు తెలుస్తుంది. ఇందుకు జనసేన అధినేత నుంచి సానుకూలత వ్యక్తం అయ్యిందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది!

రాబోయే ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 88కి ఇబ్బంది లేకుండా… టీడీపీ 145 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకుందని అంటున్నారు. ఇదే సమయంలో 25 లోక్ సభ స్థానాల్లోనూ 23 స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తుంది.

వాస్తవానికి ఈ సీట్ల విషయం అంత సులువుగా తెగలేదని అంటున్నారు. ఈ క్రమంలో ముందుగా… ఏపీలో ఉన్న పాతిక లోక్ సభ సీట్లను ప్రాతిపదికగా తీసుకుని ఒక్కో ఎంపీ స్థానంలో ఒక్కో అసెంబ్లీ సీటు వంతున పాతిక వరకూ ఇస్తామని టీడీపీ.. జనసేనకు 25 సీట్లను ప్రతిపాదించిందని అంటున్నారు. అయితే… అందుకు జనసేన అంగీకరించలేదని చెబుతున్నారు.

ఇదే సమయంలో ఒక్కో లోక్ సభ నియోజకవర్గ పరిధిలో కనీసం రెండేసి టిక్కెట్ల చొప్పున 50 సీట్లు అడిగారని తెలుస్తుంది. అయితే అందుకు ఏమాత్రం అంగీకరించని చంద్రబాబు… 30 సీట్లు ఇవ్వడానికి అంగీకరించారని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా అధికంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే ఉండొచ్చని చెబుతున్నారు!