ఫస్ట్ భార్య చనిపోయిందనుకొని రెండో భార్య, బిడ్డతో కలిసి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో విషాదం జరిగింది. ఆదిభట్ల పరిధిలోని కూర్మల్ గూడ గ్రామంలో కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన మగ్గురు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయాన్నే ఈ సంఘటన జరగడంతో అప్పుడే నిద్ర నుంచి లేచిన వారు ఈ సంఘటనను చూసి షాకయ్యారు.

కుర్మల్ గూడ గ్రామానికి చెందిన వడ్డె హనుమంతు, చంద్రకళ భార్య భర్తలు. వీరికి 9 ఏళ్ల కూతురు మంజుల ఉంది. హనుమంతుకు చంద్రకళ రెండో భార్య. మొదటి భార్య ఉండగా నిత్యం గొడవలు అవుతుండడంతో హనుమంతు రెండ పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఇద్దరు భార్యలతో కలిసి హనుమంతు ఒకే ఇంట్లో ఉంటున్నాడు.

హనుమంతు, చంద్రకళ, మంజుల మృతదేహాలు

రెండు రోజుల కింద హనుమంతు మొదటి భార్య పంచాయి పెట్టుకొని తాను చనిపోతానని బెదిరించి ఇంటి నుంచి వెళ్లి పోయింది. దీంతో భయపడిన హనుమంతు ఆమె ఆచూకీ కోసం వెతికినా దొరకలేదు.  బంధువుల ఇళ్లలోనూ వెతికినా ఆమె గురించి తెలియలేదు. దీంతో నిజంగానే మొదటి భార్య చనిపోయిందేమోనని హనుమంతు భయపడ్డాడు.

భయాందోళనకు గురైన హనుమంతు తన రెండో భార్య చంద్రకళ, కూతురు మంజులతో కలిసి ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయారు. శనివారం తెల్లవారు జామున వారు ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. మొదటి భార్య బంధువుల ఇంట్లోనే ఉన్నట్టుగా తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.