తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. కనీ వినీ ఎరుగని రీతిలో దొంగ ఓటర్లు ఓట్లేశారు. వైసీపీ నాయకులే, పొరుగు నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను పెద్దయెత్తున రప్పించారన్నది విపక్షాల ఆరోపణ. నిజమేనా.? అంత అవసరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏముంది.? తిరుపతిలో గెలుపుపై వైసీపీకి పెద్దగా అనుమానాల్లేవు. రికార్డు స్థాయి మెజార్టీ వస్తుందనే ధీమాతో వుంది వైసీపీ.
ఈ కారణంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారాన్ని కూడా లైట్ తీసుకున్నారు. అయితే, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకూ ప్రత్యకంగా మంత్రుల్ని బాధ్యులుగా నియమించారు. అందరికీ టార్గెట్లు పెట్టారు. సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో వున్నప్పుడు ఇలానే చేస్తుంది, వైసీపీ కూడా చేసింది. అయితే, దొంగ ఓటర్లు ఎక్కడినుంచి వచ్చారు.? ‘మాకు అస్సలు సంబంధం లేదు’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నుంచే పెద్దయెత్తున వాహనాల్లో దొంగ ఓటర్లు తరలి వచ్చినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.. ఆరోపించడమే కాదు, అలా వచ్చినవారిని పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది కూడా. ఎక్కడ జరిగింది లోపం.? ఎవరు చేశారు ఈ పాపం.? అన్నది తేలడం అంత తేలిక కాదు. కానీ, అధికార వైసీపీ మీద పెద్ద మచ్చ పడింది.
2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది కూడా ఇలాగేనని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. పంచాయితీ, మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీ ఇదే రాజకీయం చేసిందని మండిపడుతున్నాయి. మెజార్టీ ప్రజలు కూడా ఇదే నిజమని నమ్మే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే, ఆధారాలు అక్కడ స్పష్టంగా వున్నాయి కాబట్టి. అసలు వైసీపీకి ఆ అవసరం వుందా.? అంటే, లేనే లేదు.. కానీ, ఘోర తప్పిదం జరిగింది. విపక్షాల కుట్రా.? సొంత పార్టీలోనే ఎవరన్నా అత్యుత్సాహం ప్రదర్శించారా.? అన్నదానిపై నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే వుంది.