విశాఖ తప్పక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందంటూ తాజాగా వైసీపీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. నో డౌట్, విశాఖకు రాజధాని అయ్యేందుకు అన్ని అర్హతలూ వున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైద్రాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం విశాఖ మాత్రమే.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ రాజధాని అయి వుండాల్సింది. కానీ, కొన్ని రాజకీయాలు విశాఖకు రాజధాని హోదా దక్కకుండా చేశాయి. వైఎస్ జగన్ హయాంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా ఇచ్చేందుకు ప్రయత్నం జరిగింది.
అయితే, చిత్తశుద్ధి లేని పాలకుల కారణంగా, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ యోగం దక్కడంలేదు. తమ వైఫల్యాన్ని విపక్షాల మీదకు నెట్టేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. విశాఖ విషయంలో ఆ విద్యనే ప్రదర్శిస్తోంది వైసీపీ.
మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకి వెల్లడించి, అసెంబ్లీ నుంచి ఆ బిల్లుని వెనక్కి తీసుకుని, ఆ తర్వాత ‘మేం మూడు రాజధానులు చేసి తీరతాం..’ అంటూ వైసీపీ హడావిడి కొనసాగిస్తోంది. పోనీ, మళ్ళీ బిల్లు పెట్టారా.? అంటే అదీ లేదాయె.
కానీ, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చి తీరుతుందంటూ ఒకరి తర్వాత ఒకరు.. వైసీపీ నేతలు మీడియా ముందు క్యూలు కట్టినట్లుగా కట్టి మరీ చెబుతున్నారు. కానీ, ఎలా.? ఒక్క రాజధాని నిర్మాణానికే దిక్కులేదాయె.! గడచిన మూడేళ్ళలో అమరావతిలో రాజధానికి సంబంధించి పనులు ముందుకు నడవలేదు. ఇంకోపక్క ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతోందాయె. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించేస్తే సరిపోతుందా రానున్న రోజుల్లో.? అది మరింతగా వైసీపీ దెబ్బ తీస్తుంది రాజకీయ కోణంలో.!