మాజీ డిజిపి సాంబశివరావు బ్యాలెన్సింగ్ యాక్ట్

మాజీ డీజీపీ సాంబశివరావు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు.  మొన్న ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా  ఆయన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని కలుసుకుని రాజకీయ తుఫాన్ సృష్టించారు. ఎంత స్నేహం ఉన్నా రాజకీయ యాత్రలో ఉన్న వ్యక్తిని ఒక మాజీ పోలీసధికారి కలుసుకోవడం  రాజకీయాలు లేవంటే ఎవరు నమ్ముతారు. వైసిపి నేత  విజయసాయి రెడ్డి సాంబశివరావు కు చెమటలు పెట్టే ప్రకటన చేస్తూ  మాజీ డిజిపి వైసిపిలో చేరుతున్నారని,  2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పేశారు.  తర్వాత సాంబశివరావు స్వయంగా  దీనికి ఖండించాల్సి వచ్చింది. మొత్తానికి సాంబశివరావు జగన్ నికలుసుకోవడం వెనక ఉద్దేశం పూర్తిగా వెల్లడికాకపోయినా, ఆయన  భవిష్యత్తు కార్యక్రమం మీద మాత్రం ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యం లో ఈరోజు ఆయన  ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు.దాదాపు 20నిమిషాల పాటు మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంటే చెప్పు అని సాంబశివరావును సరదాగానే అడిగినట్లు చెబుతున్నారు

మంగళవారం అమరావతిలో చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు.  తర్వాత  ఎందుకయినా మంచిదని విలేకరులతో కూడా  మాట్లాడారు.  ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదు.  చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ సీపీగా ఉండి మర్యాదపూర్వకంగా కలిశా. ‘ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు,అంత శక్తి కూడా లేదు,’ అని ఆయన అన్నారు. ఇప్పుడు గంగవరం పోర్టు వద్దకు వచ్చినప్పుడు జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశాను. అంతే, గాని దీని వెనక రాజకీయమేమీ లేదు..’ అని సాంబశివరావు అన్నారు.స సమన్వయ లోపం కారణంగానే వైసీపీలో చేరుతున్నట్లు వారు ప్రకటించి ఉంటారని విజయసాయి ప్రకటన మీద వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబుతో భేటీలో రాజకీయ ప్రస్తావన రాలేదని చెబుతూ  గంగవరం పోర్టు, విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధిపై సలహాలు ఇచ్చానని ఆయన తన సమావేశ వివరాలు అందించారు.