వైసీపీ మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సారథ్య యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా నడ్డా సమక్షంలో సునీత దంపతులు కాషాయం కండువా కప్పుకున్నారు. పోతుల సునీత దంపతులు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2017లో టీడీపీ తరపు సునీత ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు.
అయితే 2019 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె ప్రయత్నించారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఆమెను కాదని సీనియర్ నేత కరణం బలరాంకృష్ణమూర్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో సునీత తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆ ఎన్నికల్లో బలరాం వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ మీద విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాలతో బలరాం వైసీపీలో చేరారు. ఇది జరిగిన తర్వాత 2020 నవంబర్‌లో సునీత కూడా టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. అనంతరం ఆ వైసీపీ నుంచి శాసనమండలి సభ్యురాలిగా పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు యువనేత లోకేశ్‌పై తీవ్ర విమర్శలు చేసి ఫైర్ బ్రాండ్‌గా నిలిచారు.
కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే ఆమె వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఏడాది నుంచి ఏ పార్టీలో చేరకుండా మౌనంగా ఉన్నారు. తొలుత తెలుగుదేశం పార్టీ మళ్లీ చేరాలనుకున్నా ఆ పార్టీ తలుపులు మూసివేయడంతో సైలెంట్ అయిపోయారు. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జాతీయ పార్టీ బీజేపీలో చేరారు. మరి టీడీపీ క్యాడర్‌తో ఎలా సమన్వయం చేసుకుంటారో వేచి చూడాలి.
