వైసీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నబాబు వేరే పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం ఈనాటిది కాదు. మంత్రిగా వున్నప్పుడే ఆయన పక్క చూపులు చూశారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఆ కారణంగానే ఆయన తన మంత్రి పదవిని కోల్పోయారంటారు. అందులో నిజమెంత.? అన్నది వేరే చర్చ.
తాజాగా వైసీపీలో అంతర్గత ముసలం బయల్దేరింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా మారుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గతంలో రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఒక్కరే వైసీపీకి కొరకరాని కొయ్యిలా వుండేవారు. ఇప్పుడు మొత్తంగా అలాంటి ‘కొయ్యల’ సంఖ్య మూడుకి చేరింది.. నాలుగు వైపుగా అడుగులేస్తోంది.. కాదు కాదు, అది నలభై వరకూ వుంటుందన్నది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉవాచ. నలభై కాదు, అరవైకి పైనే.. ఆ మాటకొస్తే, వైసీపీలో ముందు ముందు ఎవరూ మిగలరన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇది మరీ టూమచ్.! 2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న దరిమిలా, ఈ గోడ దూకుడు వ్యవహారాలు మామూలు. కన్నబాబు కావొచ్చు, ఇంకొకరు కావొచ్చు.. వైసీపీలో ఇమడలేకపోవడమో, గెలవలేమన్న డౌటొస్తేనో.. పక్కదారి చూడటంలో వింతేముంది.? కాకపోతే, కన్నబాబుని జనసేనలోకి రానిచ్చేది లేదంటున్నారు జనసేన నేతలు. ఈ నేపత్యంలో కన్నబాబు, టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం తెరపైకొచ్చింది. మంత్రిగా వున్నప్పుడు కన్నబాబు ఎక్కువగా విమర్శించింది జనసేననే. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఆయన చూసీ చూడనట్టు వ్యవహరించేవారు.
అప్పటినుంచే ఆయనకు టీడీపీ మీద కొంత సాఫ్ట్ కార్నర్ అన్న విమర్శలొచ్చాయి. అయితే, కన్నబాబు తన రాజకీయ భవిష్యత్తు విషయమై మెగాస్టార్ చిరంజీవితో ఈ మధ్య తరచూ చర్చిస్తున్నారట. ‘నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు..’ అని చిరంజీవి చెప్పేసినాసరే, జనసేనలో తనకు చోటివ్వాలంటూ చిరంజీవిని బతిమాలుకుంటున్నారట కన్నబాబు.