తెలుగుదేశం పార్టీ నేతలు మీద ప్రభుత్వం గట్టిగా గురుపెట్టింది. గత పాలనలో జరిగిన అన్ని అవినీతి పనులను వెతికి మరీ బయటికి లాగుతూ అరెస్టులు కూడ చేస్తున్నారు. అలా అరెస్ట్ కాబడిన వారే చింతమనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్. వీరిద్దరూ కూడ గట్టి నాయకులే. పలుకుబడి ఉన్నవారే. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కూడ. అలాంటి వారినే జగన్ గడగడలాడించారు. నెలల తరబడి జైల్లో ఉంచి మూడు చెరువుల నీళ్లు తాగించారు. తెలుగుదేశం లాంటి పార్టీకి, చంద్రబాబు లాంటి నాయకుడికి కేసులు మీదపడిన తమ పార్టీ నేతలకు లీగల్ సపోర్ట్ ఇవ్వడం, బెయిల్ వచ్చేలా చేసి జైలుకెళ్ళకుండా ఆపడం, వారాల తరబడి జైల్లో ఉండకుండా చూడటం పెద్ద కష్టమైనా పని కాదు.
కానీ చంద్రబాబు చేయలేకపోయారు. జగన్ ఉచ్చు నుండి లీడర్లను కాపాడుకోలేకపోయారు. దీంతో అప్పటివరకు ఎగిరిన టీడీపీ నేతలు చాలామందిలో భయం మొదలైంది. ఇంతటి బలమైన నాయకులనే ఆడేసుకున్నారంటే ఇక మనమెంత సైలెంట్ గా ఉంటేనే బెటర్. జగన్ దెబ్బ నుండి చంద్రబాబు కూడ మనల్ని కాపాడలేరు. ఏదో ధైర్యం కోసం ఒక మాట చేబుతారు తప్ప విపత్కర పరిస్థితే వస్తే చేతులెత్తేస్తారు అనుకుని పక్కకు తప్పుకున్నారు. అలాంటి లీడర్లలో చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూడ ఒకరు. 2009, 2014 ఎన్నికలలో చిలకలూరిపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడ పనిచేశారు. ఆ టైంలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచింది గుంటూరు జిల్లాలో. ఆయన మాటకు ఎదురనేదే లేకుండా ఉండేది. జిల్లా రాజకీయాలన్నీ ఆయన అదుపులోనే ఉండేవి.
కానీ గత ఎన్నికలో వైసీపీ నుండి విడదల రజినీ గెలుపొందడంతో ప్రత్తిపాటికి కష్టాలు మొదలయ్యాయి. పార్టీ దారుణంగా ఓడిపోవడంతో బలం లేకుండా పోయింది. జగన్ అధికారంలోకి రాగానే టీడీపీ నేతల అవినీతి కార్యకలాపాలను వెలికితీసే పని పెట్టుకున్నారు. ఆ క్రమంలో ప్రత్తిపాటి మీద కూడ ఆరోపణలు వచ్చాయి. రాజధాని భూములను బినామీ పేర్లతో పత్తిపాటి పుల్లారావు సొంతం చేసుకున్నారని ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం నివేదికలో తెలిపింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి పత్తిని కొనుగోలు చేయడంలో కూడ ఆయన చేతివాటం చూపినట్టు అభియోగాలున్నాయి. ఇవి చాలు విచారణ పేరుతో ఆయన్ను లోపలి పంపడానికి. ఈ సంగతి ప్రత్తిపాటి కూడ తెలుసు.
పైపెచ్చు జగన్ తన మీద ఎవరైతే అవాకులు చవాకులు పేలుతున్నారో వారినే ముందుగా టార్గెట్ చేస్తున్నారు. అలా బుక్కైనవారే అచ్చెన్నాయుడు, జేసీ. అందుకే మౌనంగా ఉంటే జగన్ దృష్టి నుండి తప్పించుకోవచ్చని భావించారట ప్రత్తిపాటి. అందుకే కనీసమా నియోజకవర్గం వైపు కూడ కన్నెత్తి చూడట్లేలేదట. ఎమ్మెల్యే మీద, పాలక వర్గం మీద, ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసే రిస్కీ స్టంట్స్ అస్సలు పెట్టుకోవట్లేదు. ప్రభుత్వం మీద పోరాడామని, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇస్తున్నా మీకో దండం అంటూ సొంత పనులేవో చూసుకుంటున్నారట. మరి ఈ అజ్ఞాతం ఆయన్ను ఎన్నాళ్ళు కాపాడుతుందో చూడాలి.