విశాఖలో భూరికార్డుల ట్యాపరింగ్ వ్యవహారంపై సిట్ విచారణ చేపట్టింది. ఆ నివేదికను మంగళవారం కేబినెట్ కు అందజేసింది. ఈ నివేదికలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు ఉన్నట్టు తెలుస్తోంది. ఈయన దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రెవిన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే గత పదిహేనేళ్లుగా జరిగిన భూలావాదేవీలపై సిట్ దర్యాప్తు నిర్వహించింది. ధర్మాన కుమారుడి పేరు మీద ఉన్న భూములపైనా ఆరోపణలు ఉన్నట్లు వెల్లడైంది.
ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జావోయింట్ కలెక్టర్లు పేర్లు విచారణ జరిపి సిట్ ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. 10 మంది డిఆర్వోలు, 14 మంది ఆర్డీవోల పేర్లు కూడా ఈ నివేదికలో నమోదయ్యాయి. మొత్తం 100 మంది అధికారులపై క్రిమినల్, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సిట్ తెలిపింది. ఐఏఎస్, గ్రేడ్-1 స్థాయి అధికారుల ప్రమేయం ఉందని బయటపెట్టింది. ఇందులో కొందరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని సిట్ వెల్లడించింది.
అంతేకాకుండా కొన్ని భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలనీ సిట్ బృందం స్పష్టం చేసింది. సిట్ నివేదిక తదుపరి చర్యలకు కేబినెట్ కమిటీని నియమించింది. ఈ కుంభకోణంలో ప్రముఖుల అక్రమాలు బయటపడ్డాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ సైనికుల భూములు కొట్టేసిన పెద్దలకు షాక్ తగిలినట్టైంది. అప్పటి ఎన్ఓసీల రద్దుకు కేబినెట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ భూకుంభకోణంలో మంత్రి గంటాశ్రీనివాసరావుకు సంబంధం లేదని సిట్ తేల్చడం విశేషం. కొందరు టీడీపీ నేతలు తక్కువ ధరకు కొన్న దొంగ భూములు అసలైన యజమానులకు చెందే అవకాశం ఉంది. సిట్ నివేదిక ఈ కుంభకోణంలో ఉన్న కొందరు రాజకీయనేతల దగ్గర నుండి అధికారుల వరకు మింగుడు పడని వార్త అయింది. కిందిస్థాయి రెవిన్యూ సిబ్బంది సిట్ నివేదికతో పీకలదాకా మునిగినట్టు తెలుస్తోంది.