విశాఖపట్నం భూ కుంభకోణం కేసు చంద్రబాబునాయుడును వెంటాడుతోంది. వేల కోట్ల రూపాయల భూ కుంభకోణంపై విచారణకు సిట్ నియమిస్తు ఉత్తర్వులు వచ్చాయి. చంద్రబాబు సిఎం అయిన కొత్తల్లో హుద్ హుద్ తుపాన్ వచ్చింది గుర్తుందా ? తుపాను దెబ్బకు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రెవిన్యు రికార్డులు గల్లంతయ్యాయి. దాని ఆధారంగా చేసుకుని అధికారపార్టీ నేతలు వేలాది ఎకరాలను సొంతం చేసేసుకున్నారు.
భూ రికార్డులను కొత్తగా తయారు చేసేటపుడు తమ బినామీల పేర్లతో వేలాది ఎకరాలు సొంతం అయ్యేట్లు తెరవెనుక నుండి చక్రం తిప్పారు. వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాన్ని మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు బయటపెట్టటంతో సంచలనం రేగింది. మాజీ ఎంఎల్ఏకు మద్దతుగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా కుంభకోణంకు సంబంధంచిన కొన్ని ఆధారాలను సిట్ విచారణ బృందానికి అప్పగించారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది.
సరే తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. సిట్ విచారణ నివేదికను బయటపెట్టమని ఎంతమంది అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. భూకుంభకోణానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు టిడిపి మాజీ ఎంఎల్ఏలు, నేతలు చాలామందే ఉన్నారంటూ ఆరోపణలున్నాయి. మాజీ ఎంఎల్ఏలు బండారు సత్యనారాయణమూర్తి, అనిత లాంటి వాళ్ళపై చాలా ఆరోపణలే ఉన్నాయి.
తెరపైకి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నా అసలు సూత్రదారుడు నారా లోకేష్ అనే ప్రచారం కూడా ఉంది. అందుకనే చంద్రబాబు సిట్ నివేదికను బయటపెట్టలేదని వైసిపి ఆరోపిస్తోంది. ఇపుడా విషయం మీదే జగన్ దృష్టి పెట్టారు. అప్పట్లో సిట్ విచారణను, నివేదికను పక్కన పెట్టేసి తాజాగా మరో సిట్ విచారణకు ఏర్పాటు చేశారు. తొందరలోనే విచారణ మొదలవుతుంది. కాబట్టి తొందరలోనే భూకుంభకోణంలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రదారులు బయటకు వచ్చే అవకాశం ఉంది.