విశాఖ భూ కుంభకోణం, అమరావతి కంటే పెద్దదా.?

విశాఖలో భూ కుంభకోణం ఆరోపణలు ఈనాటివి కావు. చంద్రబాబు హయాంలోనే భూముల కుంభకోణం తెరపైకొచ్చింది. అప్పట్లో ‘సిట్’ ఏర్పాటయ్యింది. కానీ, ఆ ‘సిట్’ నివేదిక బయటకు రాలేదు. పోనీ, వైసీపీ హయాంలో అయినా ఆ సిట్ నివేదికను బయటపెట్టారా.? అంటే అదీ లేదు. విశాఖలో భూ కుంభకోణమంటూ ప్రతిపక్షంలో వున్నప్పుడు తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక గమ్మునుండిపోయింది.
ఇప్పుడేమో, విశాఖలో భూ కుంభకోణానికి సంబంధించి వైసీపీ మీదనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో టీడీపీలో వున్న నేతలు చాలామంది ఇప్పుడు వైసీపీలో వున్నారు. అందుకే, వైసీపీ అధినాయకత్వం విశాఖ భూ కుంభకోణంపై మౌనంగా వుందా.? అన్న అనుమానాలు కలగకుండా వుండవు.
అమరావతి భూ కుంభకోణం కంటే పెద్దది విశాఖ భూ కుంభకోణం.. అంటూ విశాఖ ప్రజానీకంలో చర్చ జరుగుతోంది. ఇంతలా కుంభకోణానికి పాల్పడ్డారు కాబట్టే విశాఖని రాజధాని.. అంటూ రాజకీయ డ్రామాలాడుతున్నారన్న వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. అసలెందుకీ పరిస్థితి వచ్చింది.? విశాఖ భూ కుంభకోణంలో వాస్తవమేంటి.?
వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి, ‘నా కుమార్తెకు సంబంధించిన కుటుంబం భూముల్ని కొనుగోలు చేస్తే నాకేంటి సంబంధం.?’ అంటూ ప్రశ్నించేశారు. మరో ఎంపీ (లోక్‌సభ)పైనా తీవ్రమైన రీతిలో భూ కుంభకోణం ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకిలా.? అంటే, దానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి.
టీడీపీ అనుకూల మీడియా ఈ కుంభకోణాన్ని వెలికి తీయకముందే, వైసీపీకి చెందిన కొందరు, ఈ వ్యవహారంపై లీకులు మీడియాకి ఇచ్చారు. తొలుత ఈ కుంభకోణానికి సంబంధించిన కథనాలు వైసీపీ అనుకూల మీడియాలోనే వచ్చాయి. అయితే, ఆ కథనాల్లో కుంభకోణం లాంటి పెద్ద పదాలేమీ వాడలేదు.. వైసీపీ నేతలది తప్పుగానూ పేర్కొనలేదు.
అమరావతి రైతులు, అరసవెల్లి వైపుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ మీదుగానే ఈ పాదయాత్ర జరగాలి. ఇంతలోనే విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి అధికార పార్టీలో అలజడి మొదలైంది. వెరసి, విశాఖ ప్రజల్లో వైసీపీ విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇంత జరుగుతున్నా వైసీపీ అధినేత వైఎస్ జగన్ డ్యామేజీ కంట్రోల్ చర్యలకు దిగకపోవడమే ఆశ్చర్యకరం.