రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గట్టి పోటీ జరిగే నియోజకవర్గాలు ఎన్నున్నా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అతికొద్ది నియోజకవర్గాల్లో జమ్మలమడుగు కూడా ఒకటనటంలో సందేహం లేదు. అయితే 22 ఫిరాయింపు నియోజకవర్గాల్లోకి జమ్మలమడుగు నియోజకవర్గంపైనే అందరి దృష్టి నిలిచింది.
పోయిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా గెలిచిన దేవగుడి ఆదినారాయణరెడ్డి తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. ఎప్పుడైతే టిడిపిలోకి ఫిరాయించారో అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డితో ఆజన్మ వైరం ఉన్న వారు తిట్టినట్లు తిడుతునే ఉన్నారు. దాంతో స్ధానిక వైసిపి నేతలు ఆదిపై తిరగబడటంతో పాటు స్ధానిక జనాలు కూడా వ్యతిరేకమయ్యారు. అదే సమయంలో దశాబ్దాల ఫ్యాక్షన్ రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న ఇండ్ల రామసుబ్బారెడ్డితో చంద్రబాబు ఆదికి సర్దుబాటు చేశారు.
వీరిద్దరి మధ్య చంద్రబాబు ఎంతసర్దుబాటు చేసినా చాలా కాలం కలవలేదు. కాకపోతే ఎన్నికలను దృష్టి పెట్టుకుని, ఆర్ధిక లావాదేవీల వల్ల ఇద్దరు ఏకమయ్యారు. అందుకే రామసుబ్బారెడ్డికి ఎంఎల్ఏగా ఆది కడప ఎంపిగా పోటీ చేస్తున్నారు. సరే ఆదికి ఎవరు మద్దతుగా నిలబడినా ఆదిని ఓడించాలని మాత్రం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే, ఆది ఎంపిగా పోటీ చేస్తుండటం, రామసుబ్బారెడ్డి ఎంఎల్ఏగా పోటీ చేస్తుండటంతో కొన్ని సమీకరణలైతే మారిపోయాయి. అదే ఎంఎల్ఏగా ఫిరాయింపు మంత్రి పోటీ చేసుంటే పరిస్దితులు ఎలాగుండేదో ఊహించలేం.
సరే వైసిపి తరపున డాక్టర్ సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. డాక్టర్ కూడా గట్టి అభ్యర్ధే. కాకపోతే ఆది, రామసుబ్బారెడ్డిలాగ ఫ్యాక్షన్ నేతకాదు. అందుకనే సుధీర్ ఫ్యాక్షన్ రాజకీయాన్ని కాకుండా నేరుగా జనాలను, జగన్ ఇమేజిని మాత్రమే నమ్ముకున్నారు. డాక్టర్ గా తనకున్న మంచిపేరు కూడా తోడవుతుందని అనుకుంటున్నారు. మొత్తానికి ఫిరాయింపు మంత్రి వల్లే జమ్మలమడుగు నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. మరి జనాలు ఎవరిని కరుణిస్తారో చూడాల్సిందే.