దేశవ్యాప్తంగా జనాలందరూ 19వ తేదీ అంటే శనివారం సాయంత్రం 6 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల కోసం ఎందుకు ఎదురుచూస్తున్నట్లు ? ఎందుకంటే, ఎగ్జిట్ పోల్స్ మొదలయ్యేది అప్పటి నుండే కాబట్టి. దేశవ్యాప్తంగా 8 దశల పోలింగ్ అయిపోయింది. ఏడోదశ పోలింగ్ 19వ తేదీ సాయంత్రంతో ముగుస్తుంది.
అన్నీ దశల పోలింగ్ ముగిసేంత వరకూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేసేందుకు లేదని ఎన్నికల కమీషన్ స్పష్టంగా మీడియాకు ఆదేశించింది. దానితో మీడియా సంస్ధలన్నీ ఏమీ చేయలేక కూర్చున్నాయి. జాతీయ స్ధాయిలోని మీడియా సంస్ధలు ఆజ్ తక్, టైమ్స్ నౌ, ఇండియా టు డే, సిఎన్ఎన్ ఐబిఎన్ లాంటి వన్నీ ప్రీ పోల్స్ తో పాటు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వే కూడా చేశాయి.
ప్రో పోల్ సర్వేల వివరాలను పై సంస్ధలన్నీ ఎప్పుడో ప్రకటించేశాయి. అప్పటి సర్వేల ప్రకారం రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది వైసిపినే. అంటే అప్పట్లో ఎంపి సీట్లలో టిడిపి, వైసిపిల్లో దేనికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలో జరిపిన సర్వేల్లో అత్యధిక సర్వేలు వైసిపికే మొగ్గుచూపాయి. అదే దామాషాలో చూస్తే రాష్ట్రంలో అధికారం కూడా వైసిపికే దక్కుతుందని అంచనా వేసుకున్నారు.
అదే సమయంలో ఏ సర్వే కూడా టిడిపికి మెజారిటీ ఎంపి సీట్లు వస్తాయని చెప్పలేదు. సర్వేల్లో దాదాపు అన్నీ సంస్ధలు కూడా టిడిపికి అత్యధికంగా ఐదు ఎంపి సీట్లను మాత్రమే ఇచ్చాయి. ఆ దామాషాలో చూస్తే టిడిపికి రాబోయే ఎంఎల్ఏ సీట్లు సుమారుగా 40 దాకా ఉండొచ్చని అంచనా. ఇదంతా ఓ ఎత్తు. రేపు సాయంత్రం రాబోయే ఎగ్జిట్ పోల్ సర్వే ఇంకో ఎత్తు. అందులోను ఫలితాలకు మూడు రోజుల ముందు రాబోతోంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.