తెలంగాణ స్పీకర్ ఎవరనే చర్చ ఇప్పుడు అందరిలో ఉత్కంఠగా మారింది. తెలంగాణ స్పీకర్ గా పనిచేసిన తర్వాత మళ్లీ ఎన్నికలలో గత స్పీకర్ లు గెలిచిన దాఖలాలు లేవు. దీంతో స్పీకర్ పదవి తీసుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడడం లేదని తెలుస్తోంది. స్పీకర్ పదవి తీసుకుంటే ఇక చాప్టర్ క్లోజేనని అంతా భయపడుతున్నారట. దీనికి కారణం గతంలో పని చేసిన స్పీకర్లు ఎవరూ కూడా మళ్లీ గెలవలేదు. ఈ సారి స్పీకర్ పదవి ఇస్తామన్నా నేతలు వద్దు అంటున్నారట. దీంతో స్పీకర్ ఎవరనే చర్చ అంతటా జరగుతోంది.
ముఖ్యంగా స్పీకర్ పదవికి ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ముందు ఉన్నది పద్మా దేవేందర్ రెడ్డి. పద్మా దేవేందర్ రెడ్డి గతంలో డిప్యూటి స్పీకర్ గా పని చేశారు. ఆమె గతంలోనే మంత్రి పదవి కోరుకున్నా అది ఆమెకు దక్కలేదు. కేబినేట్ లో మహిళా మంత్రి లేరు అనే విమర్శను తుడిచి పెట్టడానికి ఈ సారి కేబినేట్ లో మహిళకు మంత్రిగా అవకాశం కల్పించనున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. పద్మా దేవేందర్ రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారట. స్పీకర్ పదవి తీసుకోవడానికి ఆమె ఇష్టపడడం లేదు.
ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ పేరు కూడా స్పీకర్ గా పరిశీలనకు వచ్చింది. ఆరు సార్లు కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలిచారు. చీఫ్ విప్ గా కూడా పని చేశారు. టిఆర్ఎస్ ఆరంభం నుంచి పార్టీలో కొనసాగుతున్నానని, తనకు మంత్రి పదవి కావాలని కొప్పుల ఈశ్వర్ సన్నిహితుల వద్ద అన్నాడని తెలుస్తోంది. స్పీకర్ పదవి వద్దని తనకు మంత్రి పదవే కావాలని టిఆర్ఎస్ పెద్దలకు ఈశ్వర్ తెలిపినట్టు సమాచారం
ఇక ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ పేరు స్పీకర్ గా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈటల రాజేందర్ ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశారు. ఈటల రాజేందర్ కు చాలా సౌమ్యుడు, నిబద్దత కలిగిన వ్యక్తిగా పేరుంది. అందరితో కూడా ఈటల రాజేందర్ చాలా కలుపుగోలుగా ఉంటాడు. ఆర్ధిక శాఖ మంత్రిగా కూడా ఈటల రాజేందర్ చాలా సమర్ధవంతంగా పని చేశారు.
మృదు స్వభావి, మిత భాష వాది కావడంతో ఈటల రాజేందర్ వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ అందరి నాయకులలతో సమన్వయంగా ఉండి అసెంబ్లీని నడపగలరనే ధీమాలో కేసీఆర్ ఉన్నారట. ఈటల రాజేందరే స్పీకర్ పదవికి సరైన వ్యక్తి అని దాదాపుగా ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
ఈటల రాజేందర్ మాత్రం స్పీకర్ పదవి చేపట్టడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తు భయంతో ఈటల స్పీకర పదవిని చేపట్టడానికి ఇష్టపడటం లేదని చర్చ జరుగుతోంది. గతంలో స్పీకర్ గా పని చేసిన సురేష్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, మధుసూధన చారి వీరేవరూ కూడా స్పీకర్ పదవి తరువాత జరిగిన ఎన్నికల్లో గెలవలేదు. దీంతో రాజేందర్ కూడా స్పీకర్ పదవి చేపట్టిన తర్వాత ఓడిపోతారేమోనని భయపడుతున్నారని తెలుస్తోంది. అందువల్లే ఆయన స్పీకర్ పదవి చేపట్టడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దాదాపుగా ఈటల రాజేందర్ స్పీకర్ గా ఖరారైనట్టేనని తెలుస్తోంది. మరి ఈటల రాజేందర్ పదవి చేపడుతారా లేదా అనేది వేచి చూడాలి.