సుజనాకు ఈడి భారీ షాక్ .. రూ 315 కోట్ల ఆస్తులు జప్తు

చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, టిడిపిలో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడి) భారీ షాకిచ్చింది. బ్యాంకులను మోసగించిన కేసులో వైశ్రాయ్ హోటల్స్ కు చెందిన రూ 315 కోట్ల విలువైన ఆస్తులను  జప్తు చేసింది. ఎన్నికల సమయంలో సుజనా చౌదరి ఆస్తులను జప్తు చేయటమంటే చంద్రబాబుకు కూడా షాకనే చెప్పాలి.

షెల్ కంపెనీలను పెట్టి వందల కోట్ల రూపాయలను తరలించేసినట్లు చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మనీ ల్యాండరింగ్ 2002 చట్టం ప్రకారం హైదరాబాద్ లోని వైశ్రాయ్ హోటల్ ఆస్తులను జప్తు చేసింది. డొల్ల కంపెనీలను పెట్టడం, బ్యాంకుల నుండి వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవటం వాటన్నింటినీ షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించటం లేదా దేశంలోనే ఇతర మార్గాల్లో ఉపయోగించుకుంటున్నట్లు ఈడి గుర్తించింది.

చెన్నైలోని ఆంధ్రాబ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల నుండి వందల కోట్లు అప్పులు తీసుకుని ఆ డబ్బును షెల్ కంపెనీలకు తరలించినట్లు ఈడి నిర్ధారించుకుంది. మహల్ హోటల్ అనే డొల్ల కంపెనీని సృష్టించి అందులోకి కోట్ల రూపాయలను వేసి మళ్ళీ అక్కడి నుండి వైశ్రాయ్ హోటల్స్ కు తరలించినట్లు ఈడి ఆధారాలతో సహా పట్టుకుంది. పంజాగుట్టలోని నాగార్జున హిల్స్ లోని సుజనా ఆఫీసుపై దాడి చేసి కీలకపత్రాలను స్వాధీనం చేసుకుంది. సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం టిడిపికి ఎంతైనా ఇబ్బంది కలిగించేదే అనటంలో సందేహం లేదు.