ఈసీ సీరియస్… వికారాబాద్ కలెక్టర్ పై వేటు

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై వేటు వేసింది. హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి ఈవీఎంలను తెరిచారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత గడ్డం ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దాంతో తాము తదుపరి  ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈవీఎంలను ఓపెన్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.

పార్లమెంటు ఎన్నికల కోసం సమస్యాత్మకంగా ఉన్న నియోజకవర్గాలు తప్ప మిగిలిన నియోజకవర్గాల ఈవీఎంలను తెరుచుకోవచ్చంది. కానీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉమర్ జలీల్ వాటిని పట్టించుకోకుండా వికారాబాద్ ఈవీఎంలను కూడా ఓపెన్ చేశాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీని పై విచారించిన ఈసీ వికారాబాద్ కలెక్టర్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు. కలెక్టర్ ను ఈసీ సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది.