Dussehra Holidays: దసరా సెలవులు పెంపు.. ఎన్ని రోజులంటే..?

Dussehra Holidays

ఏపీలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా సెలవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది వరకు ప్రకటించిన సెలవులను రెండు రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విజ్ఞప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు
తెలిపారు.

పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించామని ట్వీట్ చేశారు.

కాగా విద్యాశాఖ ముందుగా జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అదనంగా రెండు రోజులు సెలవులు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపాయి.

Dussehra Holidays

ఇక తెలంగాణలో ఈ నెల 21 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకూ దసరా సెలవులు ప్రకటించారు. జూనియర్‌ కా లేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకూ సెలవులు ఇచ్చారు. సెలవుల్లో పాఠశాలలు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ఆదేశించింది. ఆదేశాలు ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.