జగన్ సెక్యురిటీకి ద్రోన్లు

జగన్మోహన్ రెడ్డి సెక్యురిటికి పోలీసు శాఖ ద్రోన్లను ఉపయోగంలోకి తెచ్చింది. టెక్నాలజీపై పట్టున్న కొందరు పోలీసు ఉన్నతాధికారులు తాడేపల్లిలో ఉన్న తన ఇంటికి నాలుగు వైపులా భద్రత కోసం ద్రోన్లను ఉపయోగంలోకి తేవాలని ప్రతిపాదించగానే జగన్ కూడా అంగీకరించారు.

జగన్ ఆమోదం రాగానే ఇంటికి నాలుగువైపులా ఉన్న రోడ్లలో నాలుగు ద్రోన్లను ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. మామూలుగా అయితే పోలీసుల దృష్టికి పరిమితి ఉంటుంది. కానీ ద్రోన్లకైతే అమర్చిన కెమెరాల ప్రకారం కనీసం ఓ కిలోమీటర్ వరకూ జరిగే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.

ఉన్నతాధికారులు ఇపుడు చేస్తున్నది అదే. నాలుగు రోడ్లపైన నాలుగు ద్రోన్లను ఎగరేశారు. దాంతో ఆయా రోడ్లపై ఉన్న ట్రాఫిక్, జనాల కదలికలు, కాన్వాయ్ బయలుదేరే ముందు ట్రాఫిక్ పరిస్ధితి లాంటి వాటిని పోలీసులు చూడగలుతున్నారు.  తాడేపల్లిలో మామూలు జనాల ఇళ్ళ మధ్యే జగన్ ఇల్లు కూడా ఉండటంతో భద్రత విషయాలపై పోలీసులు మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సొచ్చింది.

తాజాగా తీసుకొచ్చిన ద్రోన్లను మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లోని టెక్ టవర్ కు అనుసంధానించారు. ద్రోన్ల కదలికలను పోలీసు సిబ్బది 24 గంటలూ మానిటర్ చేస్తూనే ఉంటారు. ఏమన్నా అనుమానం వచ్చినపుడు వెంటనే ఆ విషయాన్ని భద్రతా సిబ్బందికి చేరవేస్తారు.