23 సీట్లకు పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నాక అధినేత చంద్రబాబు నాయుడుకు కూడ ఏం చేయాలి, ఎలా చేయాలి నేయి పాలుపోలేదు. ఆ గందరగోళంలోనే పార్టీ జవసత్వాలను కోల్పోయింది. మహామహులు అనుకున్న సీనియర్ నేతలంతా సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు అంతా మాదే అన్నట్టు వ్యవహరించిన నాయకులు నోటి మీద వేలేసుకున్నారు. అదే పార్టీని వైసీపీ ముందు తేలిపోయేలా చేసింది. కంచుకోటలు అనదగిన చాలా నియోజకవర్గాల్లో పార్టీ పునాదులు కదిలిపోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు పార్టీ నాయకుల అనునది ఆశించింది ఒక్కటే. అదే పోరాటం. ఓడిపోయినంత మాత్రాన అధైర్యపడనక్కర్లేదని, ప్రభుత్వ వైఫల్యాల మీద గట్టిగా పోరాడమని, శ్రేణులను కలుపుకుని పొమ్మని చంద్రబాబు చెప్పారు. జూమ్ మీటింగ్లలో నెత్తీనోరు బాదుకున్నారు.
కానీ చాలామంది నాయకులు బాబు మాట వినలేదు. ఎక్కడికక్కడ చేతులు దులుపుకుని సైలెంట్ అయిపోయారు. వందల ఓట్ల తేడాతో ఒదిన నేతలు కూడ ఇక పార్టీని నిలబెట్టడం తమ వల్ల కాదన్నట్టు మొహం చాటేశారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన చాలామంది లీడర్లు కేసులు ఎక్కడ మీద పడతాయోనని భయపడి నోరెత్తడం మానేశారు. ఇది చంద్రబాబును తీవ్రంగా కలిచివేసింది. ఎంత చెప్పినా, ఎంత బ్రతిమాలినా నేతల తీరులో మార్పు రాకపోవడంతో పదవుల పంపకం స్టార్ట్ చేశారు. పదవులతో అయినా లీడర్లు యాక్టివ్ అవుతారేమోనని ఆశపడ్డారు. కానీ ఆ ఆశలు కూడ పూర్తిగా నెరవేరలేదు. అయితే అందరూ నిరాశపరిచినా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాత్రం అందరిలోకీ భిన్నంగా ఉన్నారు.
కొన్నాళ్లుగా నియోజకవర్గంలోని గ్రూపులను కలుపుకునిపోయే ప్రయత్నం చేస్తున్నారట. క్రితంసారి ఎవరినైతే దూరం పెట్టారో వారందరినీ విడతలవారీగా కలిసి మాట్లాడుతున్నారట. సమస్యలు తెలుసుకుంటున్నారట. పార్టీ బలోపేతానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళితే ప్రయోజనం ఉంటుంది లాంటి చర్చలు జరుపుతున్నారట. తాజాగా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు జిల్లా నేతలు, స్థానిక నాయకులు బోడె ప్రసాద్ వైఖరిలో వచ్చిన ఈ మార్పును ప్రముఖంగా ప్రస్తావించారట. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిని సైతం మించిపోతున్నారట.
దీంతో బాబు సైతం సంతృప్తి చెందారని, ఇలాగే కలిసికట్టుగా ఉంటే వచ్చే ఎన్నికల్లో పుంజుకోవడం ఖాయమని అన్నారట. మొత్తానికి బోడె ప్రసాద్ తన వైఖరితో టీడీపీలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు.