సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారిగా జరగనున్న ఎన్నికలు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు. దీంతో అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. సిట్టింగ్ స్థానం కాబట్టి వైసీపీ పోటీలో అనివార్యం, అలాగే బీజేపీ కూడ మొదటి నుండి బరిలోకి దిగాలనే నిర్ణయంతోనే ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీలో ఉండదని, బీజేపీకి సపోర్ట్ చేస్తుందని రకరకాల రూమర్లు వినబడ్డాయి. కానీ అందిరికీ షాక్ ఇస్తూ మొదటగా అభ్యర్థిని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన పనబాక లక్ష్మికే ఈసారి కూడ ఛాన్స్ ఇచ్చారు.
గత ఎన్నికల్లో పనబాక లక్ష్మి 4 లక్షల 94 వేల ఓట్లతో రెండవ స్థానంలో నిలవగా మిగతా పార్టీ అభ్యర్థులు నోటాకు మించి కూడ ఓట్లు పొందలేకపోయారు. ఇప్పటికిప్పుడు చూసుకున్నా పనబాక లక్ష్మియే బలంగా ఉన్నారు. అసలు మిగతా పార్టీలు తమ అభ్యర్థులు ఎవరనేది ఖరారు చేయలేదు. నిజం చెప్పాలంటే వారికి సరైన అభ్యర్థులు లేరు. అధికార వైసీపీ కాలం చేసిన బల్లి దుర్గాప్రసాద్ రావు కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు. వారు రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఇక గెలవాలని తపించిపోతున్న బీజేపీకి కూడ చెప్పుకోదగిన లీడర్ ఎవరూ దొరకలేదు. మొదట్లో పనబాక లక్ష్మికి గాలం వేసిన ఫలితం లేకపోయింది.
పనబాకను పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చి జనసేన మద్దతుతో గెలవాలని బీజేపీ అధిష్టానం భావించింది. అయితే చంద్రబాబు ఆ ఎత్తును ఫలించనివ్వకుండా పనబాక లక్ష్మిని అభ్యర్థిగా అనౌన్స్ చేసేశారు. సో.. ఇప్పుడు బీజేపీ సైతం కోట నాయకుడిని వెతుక్కోవాల్సిన పరిస్థితి. అయితే తిరుపతిలో చెప్పుకోదగిన లీడర్లు ఎవరూ లేరు. ఎవరినైనా సరే బయటి నుండి తీసుకురావాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు టీడీపీకి బలం కానుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పనబాక లక్ష్మికి గత ఎన్నికల్లో దగ్గర దగ్గర 5 లక్షల ఓట్లు దక్కాయి. అంతటి వైసీపీ ఊపులో కూడ బల్లి దుర్గాప్రసాదరావు లాంటి బలమైన నేతను తట్టుకుని అన్ని ఓట్లు పొందడమంటే సామాన్యమైన విషయం కాదు.
పైగా అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. గత ఎన్నికలప్పుడు వైసీపీకి ఉన్న ఏకపక్ష మద్దతు ఇప్పుడు ఉంటుందని అనుకోలేం. ఏడాదిన్నర పాలనా కాలంలో వారిపై ఎంతో కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ టీడీపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక వైసీపీ, బీజేపీ అభ్యర్థులు ఎవరో తెలిస్తే బలాబలాలను బేరీజు వేయవచ్చు. సో.. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన చంద్రబాబు ఈ ఉప ఎన్నికల్లో కూడ చతికిలబడతారనే ఆలోచనలో ఉన్నవారు ఆ ఆలోచనలు మానుకుంటే మంచిది. ఎందుకంటే పరిస్థితులు కాస్త అనుకూలిస్తే టీడీపీ గెలిచినా గెలవవచ్చు.