తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలకు చంద్రబాబు నాయుడంటే మహా ఇష్టం. ఆయన మీద ఒక మాట పడనివ్వరు. వీలైతే ఎదురుదాడికి దిగడమా లేకపోతే జనాల ముందుకొచ్చి సానుభూతికి ప్రయత్నించడమో చేస్తుంటారు. ఒక్కోసారైతే ప్రెస్ మీట్లు పెట్టుకుని కన్నీళ్లు కార్చేస్తుంటారు. ఈ సీన్ చూసిన జనాలను అయ్యబాబోయ్.. చంద్రబాబంటే వీరికి ఎంత ప్రేమో, ఎంత గౌరవమో అని ఆశ్చర్యపోతుంటారు. ఇలా నాయకుడి కోసం కన్నీళ్లు కార్చడానికి పార్టీలో కొంతమంది ప్రత్యేకంగా ఉంటారు. అలా టీడీపీలో నటి కమ్ పొలిటీషిన్ దివ్యవాణి ఉన్నారు. ఇటీవలే సినిమా ఫీల్డ్ నుండి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి రావడమే ఆమెకు పార్టీ అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టారు చంద్రబాబుగారు. ఇక అధికార ప్రతినిధి అంటే వారి కర్తవ్యాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నాయకుడి మీద ఈగ వాలకుండా చూసుకుకోవడమే వారి పని.
ఇప్పటికే పలుమార్లు ఈ పని చేసిన దివ్యవాణిగారు తాజాగా అసెంబ్లీలో బాగారి మీద వైసీపీ నేతలు చేస్తున్న మాటలు, వీడియో క్లిప్పుంగుల దాడికి ప్రతిదాడి చేసే పనిలో పడిపోయారు. సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబును ‘జయము జయము చంద్రన్న’ వీడియో చూపెట్టి మరీ ట్రోల్ చేశారు. ఈ వీడియో మాములుగా వైరల్ కాలేదు. అది పాతదే అయినప్పటికి జగన్ నేరుగా అసెంబ్లీలో ప్రదర్శించడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ వీడియో మీద వైకాపా ఎమ్మెల్యేలు సహా స్పీఎకర్ కూడ ఛలోక్తులు విసరడంతో ప్రతిపక్ష నేత విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు. దీని అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎదుర్కోలేకపోయారు. చంద్రబాబు తన సీనియారిటీని ప్రస్తావించాలని చూసినా కుదరలేదు. సభ మొత్తం ఏకపక్షమై బాబుగారి మీద విరుచుకుపడింది.
దీంతో సభలో చేసేది లేక మౌనం వహించారు తెలుగుదేశం నేతలు. ఇంట గెలవలేనప్పుడు బయట రచ్చ చేయడం రాజకీయ నాయకులకు అలవాటే కాబట్టి వైసీపీ నేతల విమర్శలకు, వెక్కిరింపులకు ఉపశమనం పొందడానికి దివ్యవాణిగారు బయట ప్రెస్ మీట్ పెట్టారు. తండ్రి వయసున్న ప్రతిపక్షనేతను పట్టుకొని పై కంపార్ట్‌మెంట్లో బుర్ర ఉందా అంటున్న ముఖ్యమంత్రికి అసలు మనసు ఉందా అంటూ దీన స్వరం అందుకున్నారు. అసెంబ్లీని దేవాలయమంటూనే, తండ్రి వయస్సున్న ప్రతిపక్షనేతను ముఖ్యమంత్రి అనరాని మాటలనడాన్ని ప్రజలంతా ఛీత్కరించుకుంటున్నారని పై కంపార్ట్ మెంట్‌లో బుర్ర అనేది ఉందా అని ప్రతిపక్ష నేతను ప్రశ్నించిన సీఎంకు మధ్య కంపార్ట్ మెంట్లో మనస్సాక్షి అనేది ఉందా అంటూ అడుగుతూ పాతవైన హోదా, మాన్సాస్ ట్రస్ట్ అంశాలను పైకి తీశారు. అలాగే పనిలో పనిగా కొడాలి నాని మీద చురకలు వేసేశారు.