అమెరికాలో తెలుగు విద్యార్థులు.! నిస్సిగ్గు రాజకీయాలు.!

ఉన్నత విద్యను అభ్యసించడం కోసమో.. ఆ పేరుతో వెళ్ళి అమెరికాలో ఉపాధి అవకాశాలు వెతుక్కుని, అక్కడే స్థిరపడ్డం కోసమో అమెరికా వెళుతున్నవారి సంఖ్య గత కొన్నాళ్ళుగా గణనీయంగా పెరుగుతోంది.

ఇంజనీరింగ్.. ఆపై అమెరికాలో ఎమ్మెస్.. ఇంకేముంది.. అమెరికాలో సెటిలైపోవడమేనన్న ఆలోచనతో వుంటున్నారు చాలామంది తెలుగు విద్యార్థులు. పదో తరగతి నుంచే అమెరికా కలలు కనేస్తున్న విద్యార్థుల్ని చూస్తున్నాం.

ఇంటర్మీడియట్‌లో వుండగానే, అమెరికా వెళ్ళేందుకోసం ఏమేం చేయాలన్నదానిపై ఖచ్చితమైన ఆలోచనతో వ్యవహరిస్తున్నారు కొందరు విద్యార్థులు. అమెరికా వెళ్ళేందుకు సహకరించే కొన్ని రకాల పరీక్షలకూ సిద్ధమవుతున్నారు.. వాటిని క్లియర్ చేస్తున్నారు కూడా.

ఇంజనీరింగ్ పూర్తవడమే తరువాయి.. అమెరికా చెక్కేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించేవారికి ఇది చాలా తేలికైన వ్యవహారం. ఇంకొందరేమో, బ్యాంకు బ్యాలెన్సుల్ని ఫేక్ చేయడమో.. కొన్ని ధృవపత్రాల్ని ఫేక్ చేయడమో.. ఎలాగోలా.. ఏం చేసైనా అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నారు.

విద్యార్హతకు సంబంధించి కూడా కొందరు తప్పుడు ధృవపత్రాల్ని ఆశ్రయిస్తుండడం గమనార్హం. ఇలాంటివారితోనే సమస్య వస్తోంది.. అమెరికాలో అడుగు పెట్టాక. కొందరు, ఇక్కడి వీసా ఇంటర్వ్యూల్లోనే ఫిల్టర్ అయిపోతున్నారు. మిగిలినవారికి, అమెరికాలో చుక్కలు కనిపిస్తున్నాయ్.

గత కొద్ది రోజులుగా, అమెరికా నుంచి తిప్పి పంపబడుతున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈసారి చిత్రమైన వాదనలు తెరపైకొస్తున్నాయి. రాజకీయ పరమైన వివాదాలు, కొందరు విద్యార్థుల్ని అమెరికా నుంచి తిప్పి పంపేయడానికి కారణమన్న చర్చ జరుగుతోంది. ఇదెంత నిజం.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.

టీడీపీ – వైసీపీ మధ్య ప్రధానంగా ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతుండడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్ అధికారులు, అమెరికాలో అడుగు పెట్టే విద్యార్థుల సామాజిక మాధ్యమాల అక్కౌంట్లను కూడా పరిశీలించే అవకాశం వుంది మరి.!