2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జగన్ పై వ్యతిరేకత ఎక్కువగా లేకపోవడంతో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని చాలామంది భావిస్తున్నారు. అయితే పార్టీలో మంచి గుర్తింపు ఉన్న నేతలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యారు. ఇతర పార్టీల నుంచి కొంతమంది వైసీపీలో చేరాలని భావిస్తున్నా వాళ్లకు టికెట్లు ఇస్తానని గ్యారంటీగా చెప్పలేనని జగన్ చెబుతున్నారు.
మరోవైపు టీడీపీకి టికెట్ల విషయంలో పెద్దగా పోటీ లేదు. రాయలసీమ జిల్లాలలో టీడీపీ తరపున టికెట్ ఇస్తామని చెబుతున్నా కొంతమంది నేతలు తమకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని చెబుతున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల ఫలితాలే 2024లో కూడా రాయలసీమ జిల్లాలలో పునరావృతం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. జనసేన పార్టీకి సైతం రాయలసీమలో ఇదే పరిస్థితి ఉందని బోగట్టా.
మూడు రాజధానుల నిర్ణయంతో జగన్ ఉత్తరాంధ్ర ప్రజల హృదయాలను సైతం గెలుచుకున్నారు. ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే అనుకూల ఫలితాలు వస్తాయో చంద్రబాబుకు సైతం అర్థం కావడం లేదని బోగట్టా. మంగళగిరి నుంచి పోటీ చేసి లోకేశ్ మళ్లీ ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏంటని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. జనసేన అడిగిన స్థాయిలో స్థానాలను కేటాయించే విషయంలో చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు.
టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందో లేదో స్పష్టత లేదు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చకూడదని ఫిక్స్ అయిన పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పాలంటే పొత్తులకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.