లోకేష్ కు భీమిలి కరెక్టా ? లేకపోతే…

ఇపుడిదే ప్రశ్న టిడిపి నేతలందరినీ వేధిస్తోంది. సొంత జిల్లా చిత్తూరును వద్దనుకుని ఎక్కడో ఉన్న విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ నియోజకవర్గంలో పోటీ చేయటమంటే శ్రేణులకు ఎటువంటి సంకేతాలు పంపుతున్నట్లు ? చిత్తూరులో లోకేష్ కు సేఫ్ నియోజకవర్గమే దొరకలేదా ? పోనీ భీమిలీ ఏ విధంగా తనకు సేఫ్ నియోజకర్గమని లోకేష్ అనుకుంటున్నారు ?  

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చంద్రబాబునాయుడు అనుకున్నట్లుగా భీమిలీ ఏమంత సేఫ్ నియోజకవర్గం కాదట. కొడుకు గెలుపుకు చంద్రబాబు ఎన్నో లెక్కలు వేసే భీమిలీని ఎంపిక చేసుంటారనటంలో సందేహం లేదు. అయితే, లోకేషే భీమిలీలో పోటీ చేయబోతున్నట్లు చంద్రబాబు చెప్పగానే నేతలందరూ భజన చేసే వాళ్ళే కానీ వాస్తవాలు చెప్పేవాళ్ళుంటారని ఎవరు అనుకోవటం లేదు. భీమిలీలో లోకేష్ గెలవటానికి ఉన్న అవకాశాలనే వివరిస్తారు కానీ నెగిటివ్ పాయింట్లు ఎంతమంది చెబుతారు ?

గెలవటానికి ఉన్న అవకాశాలు ఏమున్నాయో తెలీదు కానీ నెగిటివ్ పాయింట్లు మాత్రం చాలానే ఉన్నాయని స్ధానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఓట్లు నామమాత్రమే అన్నది మొదటి నెగిటివ్ పాయింట్. సామాజికవర్గాల పరంగా చూస్తే కాపుల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. తర్వాత యాదవులు, బిసిలున్నారు. ఇక ఎస్టీ, ఎస్సీలతో పాటు ఇతర సామాజికవర్గాలుంటాయి. వైసిపి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న అవంతి శ్రీనివాస్ ది కాపన్న విషయం తెలిసిందే.

కాపుల్లో అవంతికి మంచి పట్టుంది. పైగా ఆర్ధిక, అంగ బలాలు పుష్కలంగా ఉన్న నేత. లోకేష్ నాన్ లోకల్ అయితే అవంతి లోకల్. ఈ కారణం కూడా లోకేష్ కు మైనస్సయే అవకాశాలున్నాయి. అందులోను సిట్టింగ్ ఎంఎల్ఏ గంటాను చంద్రబాబు బలవంతంగా వేరే నియోజకవర్గానికి పంపుతున్నారు. కాబట్టి గంటా మద్దతుదారులు లోకేష్ కు ఎంత వరకూ పనిచేస్తారో అనుమానమే. వీటన్నిటికీ తోడు చంద్రబాబు పాలనపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకత. జగన్ పాదయాత్రకు జనాల బ్రహ్మరధం పట్టటం వైసిపికి బోనస్సనే చెప్పాలి. కాబట్టి లోకేష్ గెలుపు అంత వీజీ అయితే కాదనే చెప్పాలి. అంతకన్నా కుప్పమైతేనే బెటరేమో చంద్రబాబు ఒకసారి ఆలోచిస్తేనే మంచిది.