విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశంపార్టీకి పెద్ద షాక్ తగలబోతోందని సమాచారం. తెలుగుదేశంపార్టీ మాజీ ఎంఎల్ఏ పంచకర్ల రమేష్ తొందరలోనే పార్టీకి రాజీనామా చేయటానికి డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పంచకర్ల టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరబోతున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.
పంచకర్ల మొదట పెందుర్తి నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం తరపున గెలిచారు. తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు ఆయన టిడిపిలో చేరారు. 2014 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుండి రెండోసారి టిడిపి తరపున గెలిచారు.
2019లో మళ్ళీ టిడిపి తరపునే పోటి చేసి వైసిపి ప్రభంజనంలో ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. మొత్తానికి వివిధ కారణాల వల్ల పంచకర్ల పార్టీలో ఇమడలేకపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకని వైసిపిలో చేరాలని ప్రయత్నాలు చేసుకున్నారు. పంచకర్లను చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారట.
ఎలాగూ జగన్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి వచ్చే నెలలో దశరా పండగ సందర్భంగా చేరాలని ముహూర్తం కూడా డిసైడ్ అయిపోయిందట. పంచకర్ల వైసిపిలో చేరితే మరికొందరు కూడా టిడిపికి రాజీనామా చేయటానికి రెడీగా ఉన్నారట. మాజీ మంత్రి గంటా లాంటి వాళ్ళు వైసిపిలో చేరటానికి రెడీగా ఉన్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లవుతోంది టిడిపి పరిస్ధితి.